సబ్ కలెక్టర్ ఉమాహారతి
నారాయణఖేడ్: తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడం కోసం క్షేత్ర స్థాయి పర్యవేక్షణ అవసరమని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. ఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని తెలిపారు. అందువల్ల బీఎల్‌వోలు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారని, గృహాల వారీగా జాబితాను మ్యాపింగ్ చేయనున్నామని చెప్పారు. ఒక కుటుంబంలోని వారందరి ఓట్లు ఒకే దగ్గర ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఇంటి వద్దకు వచ్చే బీఎల్‌వోలకు ప్రజలు సహకరించాలన్నారు. కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తు స్వీకరించాలని, బీఎల్‌వోల పరిశీలనలో ఉన్న జాబితా క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉంటే అనెగ్జర్–3 లో నమోదు చేస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌లు హసీనాబేగం, విష్ణుసాగర్, గంగాభవాని, శివ శ్రీనివాస్, నాగజ్యోతి, కిరణ్ కుమార్, ప్రభుదాస్, ఖేడ్ మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్య, ప్రవీణ్ ఉన్నారు.


