విద్యార్థిని ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని పొడిచన్‌పల్లి తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... తండాకు చెందిన బానోత్ లత, రమేశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కాగా చిన్న కుమార్తె సాయిప్రియ(17) కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి, ఇటీవల పరీక్షలు రాసింది. అప్పటి నుంచి ఫెయిల్ అవుతాననే ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే తల్లి భయపడొద్దని ధైర్యం చెప్పినా దిగులుగా ఉంటుంది. కాగా శుక్రవారం కుటుంబీకులు గ్రామ శివారులో ఆరబోసిన ధాన్యం వద్దకు కాపలాగా వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో సాయిప్రియ ఉరివేసుకుంది. కాసేపటికి అన్నం తీసుకొని పోవడానికి వచ్చిన సోదరుడు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. చేతికొచ్చిన బిడ్డ మృత్యువాత పడటంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.


