మద్దూరు(హుస్నాబాద్): పాత కక్షలు మనస్సులో పెట్టుకొని బామ్మర్దిపై బావ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని నర్సాయపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆసిఫ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అన్నెపు శివకృష్ణ అదే గ్రామానికి చెందిన శిరీషను 2015లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగగా కేసు నమోదైంది. పెద్ద మనుషులు సర్దిజెప్పి ఇద్దరిని కలిపారు. అయితే తనపై కేసుకు బామ్మర్ది చింతల శ్రీకాంత్ కారణమని మనస్సులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి బామ్మర్ది ఇంటికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి కడుపులో పొడిచాడు. అడ్డుకోబోయిన భార్య శిరీష చేతికి గాయాలయ్యాయి. గ్రామస్తులు అడ్డుకోవడంతో శివకృష్ణ పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.


