కానరాని జొన్న కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

కానరాని జొన్న కొనుగోళ్లు

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

కానరాని జొన్న కొనుగోళ్లు

వ్యాపారులకు విక్రయిస్తున్న

అన్నదాతలు

ధరలో కోతపెడుతున్న వైనం

నష్టపోతున్న జొన్న రైతులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పంట చేతికందిన ఈ సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఈ పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తక్షణ ఆర్థికావసరాల కోసం పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులు, దళారులు జొన్న రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ధరలో భారీగా కోత పెడుతున్నారు. కనీసం మద్దతు ధర కంటే క్వింటాళుకు రూ.వెయ్యి వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో జొన్న రైతులు నిండా మునుగుతున్నారు.

92 వేల ఎకరాల్లో సాగైన జొన్న

అత్యధికంగా జొన్న సాగు చేసే జిల్లాల్లో సంగారెడ్డి ప్రధానమైనది. జిల్లాలో ఈ యాసంగి సీజనులో 92 వేల ఎకరాల్లో ఈ పంట సాగైనట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఒక్కో ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన సుమారు 18.40లక్షల క్వింటాళ్ల జొన్నలు మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఏటా ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జొన్నలను సేకరిస్తుంది. గతేడాది జిల్లావ్యాప్తంగా 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సుమారు 3.16 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది.

అధికారులకు విజ్ఞప్తులు

ప్రభుత్వం తక్షణం జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో ఇటీవల రైతులు నిరసన తెలిపారు. తక్షణం కేంద్రాలను తెరవాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రాలను సైతం అందజేశారు. ప్రభుత్వం వెంటనే జొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ధరలో భారీగా కోత

జొన్నలకు కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.3,699గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సర్కారు కేంద్రాలు లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో ధర భారీగా పడిపోయింది. క్వింటాళుకు రూ.2,600 నుంచి రూ.3,000ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఒక్కో క్వింటాళుకు రూ.వెయ్యి వరకు తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

చేతికందే సమయానికి

తెరుచుకోని కేంద్రాలు

అనుమతి రాగానే ప్రారంభిస్తాం

ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జొన్నల సేకరణ ఉంటుంది. ఆయా మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక ప్రకటించిన కనీస మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేస్తాం.

– చంద్రశేఖర్‌గౌడ్‌, మార్క్‌ఫెడ్‌, డీఎం.

Advertisement
 
Advertisement
Advertisement