కోరం లేక ఎన్నిక వాయిదా | - | Sakshi
Sakshi News home page

కోరం లేక ఎన్నిక వాయిదా

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

కోరం లేక ఎన్నిక వాయిదా ● చైర్మన్‌ గైర్హాజరు పట్ల నేలపై బైఠాయించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు ● చైర్మన్‌ తీరుపై ఎమ్మెల్యే మాణిక్‌రావు అసహనం ఒక్కరు తక్కువై.. కోరం లేక

● చైర్మన్‌ గైర్హాజరు పట్ల నేలపై బైఠాయించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు ● చైర్మన్‌ తీరుపై ఎమ్మెల్యే మాణిక్‌రావు అసహనం

జహీరాబాద్‌: జహీరాబాద్‌ మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం కోరం లేనందున వాయిదా పడింది. గురువారం ఎన్నికల షెడ్యూల్‌ మేరకు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి చైర్మన్‌ యూనూస్‌తోపాటు కాంగ్రెస్‌, మజ్లిస్‌, స్వతంత్ర కౌన్సిలర్లు గైర్హాజరుకావడంతో ఎన్నిక నిర్వహణ కోసం తగినంత కోరం లేనందున ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కమిషనర్‌ జైత్‌రాం ప్రకటించారు. దీంతో అసంతృప్తికి లోనైన బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే మాణిక్‌రావుతో కలసి కమిషనర్‌ ముందు సమావేశమందిరంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఎన్నిక నిర్వహణ ప్రక్రియకు యూనూస్‌ గైర్హాజరు కావడం తగదన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎజెండా అంశాన్ని చైర్మన్‌ సంతకంతోనే జారీ చేశారని, ఇప్పుడాయన సమావేశానికి రాకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చైర్మన్‌ సమావేశానికి రావాల్సిందేనంటూ కమిషనర్‌ ముందు పట్టుబట్టారు. ఎన్నికకు సంబంధించిన రెండు రోజులకు ముందుగానే ఇవ్వాల్సి ఉండగా రాత్రికి రాత్రి 10 గంటలకు ఆగమేఘాలమీద జారీ చేసి షెడ్యూల్‌ను ప్రకటించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. కొందరు కౌన్సిలర్లు ఆస్పత్రుల్లో ఉన్నా ఎన్నికల నిర్వహణ కోసమని హైదరాబాద్‌ నుంచి సమావేశానికి హాజరైనట్లు పలువురు పేర్కొన్నారు. చైర్మన్‌ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కౌన్సిల్‌లో 37మంది సభ్యులున్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు ఉన్నారు. దీంతో కౌన్సిల్‌ సభ్యుల సభ్య 39కి చేరింది. సమావేశం నిర్వహణకుగాను అవసరమైన కోరం 20 మంది సభ్యుల హాజరు తప్పనిసరి. కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహణ కోసం ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే మాణిక్‌రావుతోపాటు బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు 15మంది, బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు హాజరయ్యారు. వీరి సంఖ్య 19కి చేరింది. దీంతో కోరం లేని కారణంగా ఎన్నిక వాయిదా పడక తప్పలేదు.

రాత్రికి రాత్రి సర్క్యులర్‌ జారీనా: మాణిక్‌రావు

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక వాయిదా పడిన అనంతరం ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ..రాత్రి పది గంటలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సర్క్యులర్‌ను సభ్యులకు అందజేయడం సరికాదన్నారు. రాత్రికి రాత్రే ఆస్పత్రుల్లో ఉన్న కౌన్సిలర్లకు, ఇతర ప్రాంతాల్లో ఉన్న కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చి పిలిపించుకోవాల్సి వచ్చిందన్నారు. సర్క్యులర్‌ ఇచ్చిన చైర్మన్‌ కూడా పత్తా లేకుండా పోయారన్నారు. ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement