మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం మిరుదొడ్డి ఎస్‌ఐ సమత కథనం ప్రకారం... సిద్దిపేట మండలం ఎన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన అంబటి నారాయణ భాగ్యవ్వ దంపతుల కుమారుడు వెంకటేశ్ గౌడ్ (25) మల్లన్న సాగర్ ప్రాజెక్టు మెగా కన్‌స్ట్రక్షన్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గురువారం రాత్రి మిరుదొడ్డి నుంచి, ధర్మారం వైపు బైక్‌పై బయలు దేరాడు. ఈ క్రమంలో లక్ష్మీనగర్ శివారులోని మూల మలుపు వద్దకు రాగానే బైక్ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో కిందపడిన అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


