కోటగిరి సింగారం
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహ్మదాపూర్, ఉమ్మాపూర్, ఆకునూర్ గ్రామాలను ఆనుకొని 800 మీటర్ల ఎత్తయిన కోటగిరి గట్లపై చాళుక్యుల కాలం నాటి పురాతన రాతి కోట ఉంది. మూడు జిల్లాల పరిధిలో 3,200 ఎకరాల్లో విస్తరించిన అడవిలో 36 గుట్టల సమూహం పచ్చదనంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కును నిర్మించడానికి ప్రభుత్వ అనుమతులు వచ్చాయి. దీంతో హరితనిధి కింద మొదటి విడుత రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 10న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లెలగడ్డ ప్రాంతంలో పనులకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పార్కు పనులు పూర్తి చేయనున్నారు. మొదటి విడుత కరీంనగర్ జిల్లా ఆకునూర్ రిజర్వుడు ఫారెస్ట్ పరిధిలో 350 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కు పనులు చేపట్టేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పార్కులో ఏముంటాయి..
అర్బన్ ఫారెస్ట్ పార్కులో మూడు పగోడాలు (గుడిసెలు), చైన్ లింక్ గేటు, వాకింగ్ ట్రాక్, పర్యాటకుల కోసం వాచ్ టవర్, పిల్లల పార్కు, రెండు గుట్టల మధ్య బ్రిడ్జి, రాయికల్ వాటర్ పాల్స్ దగ్గర ట్రెకింగ్ స్పాట్, పర్యాటకులు సేద తీరేందుకు ఉద్యానవనాలు, గడ్డి మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. సోలార్ కుంటలు, లైటింగ్ సిస్టం, సీసీ రోడ్ల నిర్మాణం, గుట్టలపై బ్రిడ్జిల నిర్మాణం, రాతి కట్టడాలతో నిర్మించే నీటి కుంటలు, చెక్ డ్యాం, కోటపై క్యాంపు నిర్మాణంతోపాటు పర్యాటకుల కోసం కమ్యూనిటీ హాల్స్‌ను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థులకు
అధ్యయన కేంద్రం
అటవీ, ఉద్యానవన, అగ్రికల్చర్ కళాశాలల విద్యార్థులు మొక్కలపై అధ్యయనం చేయడానికి అర్బన్ ఫారెస్ట్ ఫార్కు ఉపయోగపడుతుంది. హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల నుంచి పర్యాటకులు వచ్చేందుకు అనువైన రోడ్లు ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలు, జలాశయాలు ఉండటంతో అటవీ జంతువులను కూడా పెంచే ప్రయత్నం అధికారులు చేయనున్నారు.
రూ.10 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కు పనులు
విద్యార్థుల అధ్యయనానికి కేంద్ర బిందువు
ప్రకృతి అందాలు, ఆకర్షించే కోటగిరి గట్లు
సర్వాయి పాపన్న కోట, కాలభైరవ క్షేత్రం
కోటగిరి సింగారం


