 
															పత్తిని ముంచిన మోంథా
● రైతుల ఆశలపై నీళ్లు జల్లిన తుపాను
● ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
పత్తి రైతుల్ని మొంథా తుపాను నిలువెల్లా ముంచేసింది. అసలే ఈ ఏడాది వరుస వర్షాలతో దిగుబడి తగ్గిపోయి పత్తి రైతుల్ని తీవ్రంగా దెబ్బతీయగా తాజా ముసురు రైతులుపెట్టుకున్న చిన్నపాటి ఆశలపై కూడా ‘కన్నీళ్లు’చల్లింది. దీంతో పత్తి రైతులు తీవ్ర నష్టాలపాలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పత్తిరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. –మునిపల్లి(అందోల్)
జిల్లాలో 3.48 లక్షల ఎకరాల్లో ఆయా గ్రామాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో పడిన భారీవర్షాలతో పత్తి పంట భారీగా దెబ్బతింది. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి ఆశించిన రైతులకు ప్రస్తుతం 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో పూర్తిస్థాయిలో కూరుకుపోయారు. సుమారు 45 రోజుల క్రితమే కూలీలతో పత్తితీతకు రైతులు అన్నీ సిద్ధం చేస్తుండగానే భారీ నుంచి అతిభారీ వర్షాలు పడి పత్తిపంట దిగుబడి భారీగా పడిపోయింది. కొంతమంది రైతులకు ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే రావడంతో ఆ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంట దిగుబడి కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తెచ్చిన అప్పు ఎలా కట్టాలో తెలియడం లేదని రైతులు మనోవేదన చెందుతున్నారు. ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకు పంట దిగుబడి కోసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వర్షాలు తమను నిండా ముంచాయని పలువురు రైతులు దుఃఖిస్తున్నారు.
ఐదారు రోజుల తర్వాతే తీత పనులు
గత 45 రోజుల నుంచి పలు తుపాన్ల రూపంలో వచ్చిన వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కష్టపడి పండించిన పత్తి పంటను వర్షాలు మట్టిపాలు చేశాయి. వర్షపు నీరు కారణంగా కూలీలు పత్తి తీయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. ఎండలు బాగా కాస్తే సుమారు ఐదు ఆరు రోజుల తర్వాత పత్తి పంట తీసే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ నిర్ణయంపై ఆధారం
పంట నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పరిహారం మంజూరుకు సంబంధిత అధికారులకు నివేదిక అందజేస్తాం.
–శివప్రసాద్, జిల్లా వ్యవసాయాఽధికారి
తీవ్రంగా నష్టపోయా
మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశా. అధిక వర్షాలు పత్తి పంటను దెబ్బతిశాయి. ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. ఎకరంన్నర భూమిలో పత్తితీత పనులు పూర్తయ్యాయి. జోరుగా వర్షాలు పడుతుండటంతో పత్తితీత పనులకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలి.
–ఇస్మాయిల్, పత్తి రైతు, రాయికోడ్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
