 
															బెదిరింపు కేసును ఛేదించిన పోలీసులు
నిందితుల రిమాండ్ 
దుబ్బాకటౌన్: అక్బర్పేట–భూంపల్లి మండలంలోని రుద్రారంలో ఆర్‌ఎంపీ ఇంట్లోకి చొరబడి, తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సిద్దిపేట ఏసీపీ రవీందరెడ్డి వెల్లడించారు. రుద్రారంలో ఆర్‌ఎంపీ లక్ష్మీనర్సయ్య ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు చొరబడి చంపుతామంటూ తుపాకీతో బెదిరించారన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ధర్మారానికి చెందిన మొగిలి భిక్షపతి, కాసులాబాద్‌కి చెందిన గోవిందారం బ్రహ్మం, రుద్రారానికి చెందిన రంగనమైన నర్సింలు అలియాస్ కమలాకర్‌తో పాటు రుద్రారానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు నరేందర్ రెడ్డిని నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు హరీష్, సమతను ఏసీపీ ప్రత్యేకంగా అభినంధించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
