 
															నూతన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
గజ్వేల్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోగల ఎస్‌ఎల్‌ఎన్ కన్వెన్షన్‌లో రాణే పరిశ్రమ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులకు రక్షణగా ఉండే చట్టాలను బలహీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. వేతనాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పర్మినెంట్ ఉద్యోగులు లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ పరిశ్రమల యాజ మాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి వాటిని అమలు చేసేందుకు శ్రమశక్తి నీతి 2025 పేరుతో తీసుకువచ్చిన నూతన లేబర్ పాలసీని సీఐటీయూ వ్యతిరేకిస్తుందని తెలిపారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల రణక్ష కోసం పోరాటు చేసేందుకు డిసెంబర్ నెలలో మెదక్‌లో రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు వేణుగోపాల్, బండ్లస్వామి, యూనియన్ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్, రంగారెడ్డి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
