
మందు బాబులు.. మారరా..?
జహీరాబాద్ టౌన్: నెల రోజుల క్రితం ఓ యువకుడు మద్యం మత్తులో బైక్‌ను అతివేగంగా నడిపి అల్లీపూర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏప్రిల్ నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పటాన్‌చెరువు ఎస్‌ఐ. నాగలక్ష్మిని మందుబాబులు కారుతో ఢీకొట్టారు. ఆమెకు గాయాలు కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
కొంత మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అతి వేగంగా.. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ఇతర వాహనదారులూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కొంత మందికి గాయాలు కాగా మరి కొంత మంది చనిపోతున్నారు. ప్రమాదాల నియంత్రణకు పోలీస్‌శాఖ డ్రంకెన్ అండ్ డ్రైవ్ చేపట్టింది. బ్రీత్ ఎనలైజర్లతో ఆల్కహాల్ పరీక్ష చేసి మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానతో పాటు శిక్ష పడేలా చేస్తుంది. అయితే.. రహదారి ప్రమాదాలను అరికట్టడానికి జిల్లాలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసుల ద్వారా మందుబాబులకు దడ పుట్టిస్తున్నారు. తాగి వాహనం నడుపుతూ తనిఖీలో పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కోర్టులో హాజరుపరుస్తుండగా న్యాయమూర్తులు నిందితులకు జరిమానతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. అయినా మందుబాబుల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.
అన్ని రకాల ఇబ్బందులే..
మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. తనిఖీల్లో పట్టుబడితే కేసులు, జైలు శిక్ష పడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే రూ. 2 వేల నుంచి రూ.15 వేల వరకు జరిమాన పడుతుంది. మొదటి నేరానికి రూ.10 వేల జరిమాన లేదా 6 నెలల జైలు శిక్ష పడుతుంది. లేదా రెండూ విధించవచ్చు. మూడు సంవత్సరాల లోపు రెండోసారి నేరం చేస్తే రూ.15 వేల జరిమాన లేదా రెండు సంవత్సరాల జైలు శిక్ష పడతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోయే అవకాశం కూడా ఉంది.
ప్రతి రోజు 200 కేసులు
జిల్లాలో సగటున ప్రతి రోజు 200 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 1,400 కేసులు నమోదు అయ్యాయి. డిసెంబర్ 31 ఒక్క రోజే 282 కేసులు నమోదు అయ్యాయి. కేసులతో పాటు జరిమాన, జైలు శిక్షలు కూడా పడ్డాయి.
కేసులు నమోదు అయినా కనిపించని మార్పు
ప్రమాదాల బారిన పడుతున్న మద్యం ప్రియులు
సుమారు 1400 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. మద్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. –వినయ్ కుమార్,
ఎస్‌ఐ జహీరాబాద్ టౌన్

మందు బాబులు.. మారరా..?