
వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం
జిన్నారం (పటాన్‌చెరు): ఓ వృద్ధురాలు అదృశ్యమైన ఘటన గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... నగరానికి చెందిన సూరారం బాలమణి అనే వృద్ధురాలు సోమవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు. వృద్ధురాలి జాడ తెలిస్తే 95029 74643 నంబరుకు తెలియజేయాలని కుటుంబ సభ్యుడు అనిల్ విజ్ఞప్తి చేశారు.
ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి..
సంగారెడ్డి క్రైమ్: వ్యక్తి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... శివాజీనగర్ చెందిన చదువుల వెంకటేష్ (28) వృత్తిరీత్య పట్టణంలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. ఈ నెల 12న రాత్రి 9గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డిలో మహిళ...
ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. పట్టణ సీఐ వివరాల ప్రకారం... పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మహిళ (25), ఈ నెల 14న సోమవారం ఉదయం 10గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ తిరిగి రాలేదు. చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థిని..
చేగుంట(తూప్రాన్): విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు...ఈనెల 2న నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అంగర్క గ్రామానికి చెందిన బాలికను ఇంటర్ మొదటి సంవత్సరం చదివేందుకు రెడ్డిపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో చేర్పించారు. ఈనెల 7న బాలిక తల్లినని పాఠశాల ఎస్‌ఓ శ్రీవాణికి ఫోన్ చేసి బాలిక మేనమామను పంపిస్తున్నట్లు అతడితో తన కూతురుని పంపించాలని కోరింది. నమ్మిన పాఠశాల సిబ్బంది బాలికను ఇంటికి పంపించేందుకు అనుమతించారు. ఆ తర్వాత రెండు రోజులకు సిబ్బంది బాలిక కుటుంబీకులకు ఫోన్ చేసి పాఠశాలకు పంపించాలని కోరడానికి ప్రయత్నించగా బంధువులు ఎవరూ ఫోన్‌లో స్పందించలేదు. అనుమానంతో ఎస్‌ఓ శ్రీవాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలికకు ఇటీవలే వివాహం జరిగినట్లు సమాచారం. ఈ విషయమై కస్తూర్బా ఎస్‌ఓను వివరణ కోరగా బాలిక అదృశ్యం విషయం తెలిపేందుకు నిరాకరించారు. ఎస్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం