
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
మాజీ ఎయిర్ మార్షల్ చంద్రశేఖర్
ములుగు(గజ్వేల్): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మాజీ కమాండెంట్ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఎయిర్ మార్షల్ బవిశెట్టి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మక్కపల్లిలోని ఓ ఫంక్షన్‌హాలులో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు కప్స్‌తో పాటు మెమెంటోలు, మెడల్స్‌ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తి, సామాజిక సేవను అలవర్చుకోవాలన్నారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు విష్ణుజగతి కార్యక్రమానికి హాజరైన అతిథులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, ఆయా పాఠశాలల, ట్రస్ట్ ప్రతినిధులు రాజశేఖర్‌రెడ్డి, ఆంజనేయులు, శేషారెడ్డి, రామ్ నరసింహాగౌడ్, చంటి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణ, పురుషోత్తం, సుధాకర్, విజయేందర్‌రెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డి, చంద్రమౌళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.