
ఆ పాఠశాల నందనవనం
తూప్రాన్: ఆహ్లాదం..పచ్చదనంతో పట్టణ పరిధిలోని పోతరాజుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందనవనంను తలపిస్తోంది. విద్యార్థులు మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి నేడు వృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. పచ్చదనం అలుముకుని చల్లని నీడతోపాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థి ఒక మొక్క చొప్పున పూలు, పండ్ల మొక్కలు దానిమ్మ, జామ, కర్జూరం, బాదం, మామిడి తదితర మొక్కలు పాఠశాల ఆవరణలో నాటారు. వాటి సంరక్షణ బాధ్యతలను ఆ విద్యార్థులకు అప్పగించారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో మొక్కలకు నీరు పోసి సంరక్షించారు. నేడు ఆ మొక్కలే వృక్షాలై చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.