వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా అనుకుంటకు చెందిన మైనాబాయి(62) మూడు రోజుల క్రితం ఫొటో ఫ్రేమ్‌లు అమ్ముకునేందుకు మెదక్ పట్టణానికి వచ్చింది. ఔరంగాబాద్ శివారులోని కలెక్టరేట్ కార్యాలయం ముందు గల గేటు వద్ద మెదక్ వైపు నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు గోవింద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి..
మనోహరాబాద్(తూప్రాన్): ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ వివరాల ప్రకారం... కొండాపూర్ గ్రామానికి చెందిన కుక్కదువ్వు మల్లేష్(54), పెంజర్ల యాదయ్య తమ టీవీఎస్ మోపెడ్‌పై పని నిమిత్తం మండల కేంద్రానికి వెళుతున్నారు. అదే సమయంలో నిజమాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి–44పై జీడిపల్లి శివారులోకి రాగానే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా నడుపుతూ ముందు వెళుతున్న మోపెడ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న మల్లేష్‌కు తీవ్రగాయాలవ్వగా, యాదయ్యకు కుడిచెయ్యి విరిగింది. స్థానికులు తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మల్లేష్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


