అలంకారప్రాయంగా సీడీసీ
జహీరాబాద్: జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం 2023–24, 2024–25 క్రషింగ్ సీజన్‌లో చెరకును క్రషింగ్ నిర్వహించకపోవడంతో మూత పడింది. దీంతో కేన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(సీడీసీ)కు రావాల్సిన నిధులు రాకుండా పోయాయి. జోన్ పరిధిలో ప్రతి ఏటా సుమారు 7లక్షల టన్నుల మేర చెరకు ఉత్పత్తి అవుతుంది. ట్రైడెంట్ మూతపడటంతో జోన్ పరిధిలో రైతులు పండించిన చెరకు పంటను పక్క జిల్లాల్లోని కర్మాగారాలతో పాటు పక్క రాష్ట్రాలకు తరలించారు. దీంతో రెండేళ్లుగా సుమారు రూ.కోటి మేర సీడీసీ కార్యాలయం నిధులను కోల్పోవాల్సి వచ్చింది. చెరకు పంట టన్నుకు రూ.4 చొప్పున యాజమాన్యాలు రైతుల బిల్లుల నుంచి మినహాయించుకుని, యాజమాన్యం సైతం తనవంతు వాటా కింద టన్నుకు రూ.4 చొప్పున సీడీసీ ఖాతాల్లో జమ చేస్తాయి. ఇరువురి వాటా కలిపి టన్నుకు రూ.8 చొప్పున నిధులు సమకూరుతాయి. ఈ నిధుల నుంచి కేన్ అధికారులు చెరకు రైతులకు సబ్సిడీపై గడ్డి మందులు, ఇతర యంత్ర పరికరాలను అందజేస్తారు. అవసరమైతే పొలాలకు వెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రోడ్ల మరమ్మతులు చేపడతారు. రెండేళ్లుగా ట్రైడెంట్ కర్మాగారం మూతపడటంతో జహీరాబాద్ సీడీసీకి నయా పైసా నిధులు రాకపోవడంతో సబ్సిడీ పథకాలను నిలిపివేశారు. దీంతో జహీరాబాద్ జోన్ చెరకు రైతులకు మాత్రం నిరాశే మిగిలింది.
పక్క కర్మాగారాల రైతులకే లబ్ధి
జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పక్క కర్మాగారాలకు చెరకు ఉత్పత్తులు తరలడంతో ఆయా కర్మాగారాల పరిధిలో ఉన్న సీడీసీలకే నిధులు జమ అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి 2024–25 సీజన్‌కు గాను కొత్తగా ప్రారంభించిన రాయికోడ్‌లోని మాటూరు చక్కెర కర్మాగారానికి 1.15లక్షల టన్నుల చెరకు ఉత్పత్తులను రైతులు తరలించారు. సంగారెడ్డిలోని గణపతి చక్కెర కర్మాగారానికి 1.80లక్షల టన్నులు, మహబూబ్‌నగర్‌లోని కొత్తకోట కర్మాగారానికి 70వేల టన్నులు, నారాయణఖేడ్‌లోని మాగి కర్మాగారానికి 75వేలు, కామారెడ్డిలోని చక్కెర కర్మాగారానికి 75వేల టన్నుల చెరకు పంట క్రషింగ్ నిమిత్తం జహీరాబాద్ జోన్ నుంచి తరలివెళ్లింది. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు సైతం సుమారు 2లక్షల టన్నుల మేర చెరకు వెళ్లింది. ఇలా పక్క ప్రాంతాలకు తరలివెళ్లిన చెరకు పంటతో జహీరాబాద్ సీడీసీకి గత రెండేళ్లుగా సుమారు రూ.కోటి మేర ఆదాయం రాకుండా పోయింది.
కుదించుకుపోయిన జోన్ పరిధి
జహీరాబాద్ చెరకు జోన్ పరిధి కుదించుకుపోయింది. ట్రైడెంట్ కర్మాగారం మూత పడటం వల్ల జోన్ పరిధిని కుదించి కొత్తగా మాటూర్ జోన్‌ను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన గోదావరి–గంగా చక్కెర కర్మాగారం జోన్ పరిధిలోకి కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్, వట్‌పల్లి మండలాలను చేర్చారు. దీంతో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలు మాత్రమే ప్రస్తుతం పాత జోన్ పరిధిలో మిగిలి ఉన్నాయి.
రెండు సీజన్లలో ‘ట్రైడెంట్’ మూత ఫలితం
పక్క కర్మాగారాలకు తరలిన చెరకు
రెండేళ్లుగా కోల్పోయిన ఆదాయం
పేరుకే కార్యాలయం
జహీరాబాద్‌లో సీడీసీ కార్యాలయం పేరుకే ఉంది. జోన్ పరిధిలో కర్మాగారాలు లేకపోవడంతో కార్యాలయం పరిస్థితి నిస్తేజంగా మారింది. కొత్తగా రాయికోడ్ కేన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఏర్పడిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మాటూర్‌లో గోదావరి–గంగా చక్కెర కర్మాగారం కొత్తగా ఏర్పడటంతో ప్రస్తుతం రాయికోడ్ సీడీసీ కార్యకలాపాలు జహీరాబాద్ కార్యాలయం ద్వారానే కొనసాగుతున్నాయి.


