
8 లక్షల ఎకరాల్లో సాగు
ఎరువుల అంచనా ఇలా
జిల్లాలో పంటలకు అవసరమయ్యే ఎరువుల కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికలను సిద్ధం చేశారు. యూరియా 41,900, డీఏపీ 16,045, ఎంఓపీ 19,682, కాంప్లెక్స్ 36,804, ఎస్‌ఎస్‌పీ 9,225 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వివిధ రకాల ఎరువులు 18,757 మెట్రిక్ టన్నులు అందుబాటులోనే ఉన్నాయి. మొత్తంగా ఈ ఏడాది 1,23,656 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమున్నట్లు ప్రణాళికలో పేర్కొన్నారు.
వానాకాలం సీజన్‌లో పంటల సాగు అంచనా వివరాలు
పంట రకం గత సం.. సాగువివరాలు ప్రస్తుత సం.. సాగు అంచనా
వరి 1,50,157 1,65,173
మొక్క జొన్న 7,257 7,983
పత్తి 3,52,308 3,87,539
కంది 77,110 84,821
సోయాబీన్ 71,966 79,613
పెసర 13,478 14,826
మినుములు 8,897 9,787
ఇతరములు 26,339 26,256
హార్టికల్చర్ 25,534 28,964
మొత్తం 7,33,047 8,04,512
● వానాకాలం పంటల అంచనా
● గతేడాది కంటే పెరిగిన సాగు విస్తీర్ణం
సంగారెడ్డి జోన్: ఈ ఏడాది ఖరీఫ్ పంటల ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లాలో వానాకాలం సాగు పంటలపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 8,04,512 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. ఈ మేరకు సాగు విస్తీర్ణం, పంట రకంతోపాటు సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాలు తదితర అంశాలతో కూడిన ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. గతేడాది కంటే ఈసారి సుమారు 70 వేల ఎకరాల్లో అత్యధికంగా సాగు చేయనున్నట్లు ప్రణాళికల్లో పేర్కొన్నారు. జిల్లాలో గతేడాది సాగు చేసిన పంటల ఆధారంగా సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు.
అత్యధికంగా పత్తి సాగు
జిల్లాలో సాగు చేస్తున్న పంటల్లో అత్యధికంగా పత్తి సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా ప్రతీ ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది సుమారు 70వేల ఎకరాలకు పైగా పత్తి పంట అధికంగా సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. ఈ మేరకు 7,75,078 మేర పత్తి ప్యాకెట్లు అవసరం ఉన్నట్లు తెలిపారు.
వరి, సోయాబీన్, కందితోపాటు ఇతర పంటలు
పత్తి పంట తర్వాత అత్యధికంగా జిల్లాలో వరి పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో 1,65,173 ఎకరాలు, కంది 84,821, సోయాబీన్ పంట 79,163, మొక్కజొన్న 7,983 పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఆయా పంటలకు ఎంత మేర విత్తనాలు అవసరమో వాటి ప్రణాళికలను సైతం సిద్ధం చేశారు.
ప్రణాళికలను సిద్ధం చేశాం
వానకాలం సీజన్‌లో భాగంగా సాగు చేసే పంటలను అంచనా వేసి ప్రణాళికలను తయారు చేయడం జరిగింది. సాగు చేసే పంటలకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అంచనా వేశాం. గతేడాది కంటే ఈసారి పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేసే అవకాశముంది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
–శివప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, సంగారెడ్డి.

8 లక్షల ఎకరాల్లో సాగు