
నీట్ పరీక్షకు సర్వం సిద్ధం
● హాజరు కానున్న 3,320 మంది అభ్యర్థులు ● కలెక్టర్ క్రాంతి వెల్లడి
సంగారెడ్డి జోన్: నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ క్రాంతి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష జరగనుందని చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,320 మంది పరీక్షకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. పరీక్ష హాలులోకి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు ఉంటాయన్నారు.
పకడ్బందీగా రెవెన్యూ సదస్సులు
భూ భారతి చట్టం, రెవెన్యూ సదస్సులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో మూడు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు ఇతర సమస్యలపై కూడా ఒక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్‌ఓ పద్మజారాణి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ పాల్గొన్నారు.