అంజిరెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం | - | Sakshi
Sakshi News home page

అంజిరెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం

Jan 11 2025 8:15 AM | Updated on Jan 11 2025 8:15 AM

అంజిరెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం

అంజిరెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: శాసన మండలి ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిత్వం కోసం అంజిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రానున్న శాసన మండలి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాలో అంజిరెడ్డికి చోటు దక్కింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్‌ సి.అంజిరెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. ఈ అభ్యర్థిత్వం కోసం పలు జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు పలువురు ప్రయత్నాలు చేశారు. కానీ అధినాయకత్వం మాత్రం అంజిరెడ్డి వైపే మొగ్గు చూపింది. రామచంద్రాపురానికి చెందిన అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఆయన సతీమణి గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు. విద్యావంతుడు, పారిశ్రామికవేత్త అయిన అంజిరెడ్డిని బలమైన అభ్యర్థిగా ఆ పార్టీ భావించి పట్టభద్రుల అభ్యర్థిగా ప్రకటించిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రెండు దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు

అంజిరెడ్డి తన ఎస్‌.ఆర్‌.ట్రస్ట్‌ ద్వారా గత రెండు దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు విద్యా అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు తన ట్రస్ట్‌ ద్వారా కల్పిస్తున్నారు. ఇటు పార్టీ పరంగా కూడా సంగారెడ్డి జిల్లా బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఆ పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు జరిగిన జిల్లాల్లో సంగారెడ్డి ఒకటి. గతేడాది జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ స్థానం గెలుపులో తనవంతు కృషి చేశారు. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో ఆ పార్టీ అధినాయకత్వం ఈ టికెట్‌ విషయంలో అంజిరెడ్డి వైపు మొగ్గు చూపిందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘నాపై నమ్మకం ఉంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు’అని అంజిరెడ్డి పేర్కొన్నారు.

పట్టభద్రుల నియోజకవర్గం

బీజేపీ అభ్యర్థి

డా.సి.అంజిరెడ్డి

ఖరారు చేసిన బీజేపీ

ఫలించిన అంజిరెడ్డి ప్రయత్నాలు

పోటీ పడిన పలు జిల్లాల కీలక నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement