ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం

మంత్రి దామోదరను కలిసిన రాములు - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఓ వరమని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం వాల్‌పోస్టర్‌ను నేతలతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా పేదలకు రూ.10 లక్షల వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. గతంలో ఐదు లక్షల వరకే ఆరోగ్య బీమా ఉండగా ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పది లక్షలకు పెంచిందన్నారు. 1,672 రకాల వ్యాధులకు వైద్యం అందించే దిశగా సర్కారు చర్యలు తీసుకుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యువరాజ్‌, రతన్‌ సింగ్‌, రాజు, సాయిన్న పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన

విద్యుత్‌ శాఖ డైరెక్టర్‌

సంగారెడ్డి : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహను ఆదివారం విద్యుత్‌ పంపిణీ సంస్థ కమర్షియల్‌ విభాగ డైరెక్టర్‌ కె. రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం బహూకరించి అభినందనలు తెలిపారు. ఆయన వెంట ఐఎన్‌టీయూసీకి చెందిన 327 యూనియన్‌ జిల్లా కార్యదర్శి భూపాల్‌ రెడ్డి ఉన్నారు.

హర్షణీయం

సంగారెడ్డి: ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం హర్షణీయమని ఆర్టీసీ ఆర్‌ఎం ప్రభులత అన్నారు. ఆదివారం కొత్త బస్టాండ్‌ ఆవరణలో ఉచిత బస్సు సౌకర్యాన్ని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాశ్‌ రెడ్డి కలిసి ఆమె ప్రారంభించారు. డిప్యూటీ ఆర్‌ఎం జోస్న, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్‌ఎంఎంఎస్‌

పరీక్ష ప్రశాంతం

సంగారెడ్డి అర్బన్‌: 8వ తరగతి విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షను ఆదివారం రాశారు. జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మొత్తం 882 మంది పరీక్షను రాశారని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులకు ఐదేళ్ల సంవత్సరాల పాటు ఏడాదికి 12,000 స్కాలర్‌షిప్‌ అందనుందని వెల్లడించారు.

దేదీప్యం.. వర్గల్‌ క్షేత్రం

వర్గల్‌(గజ్వేల్‌): దివ్వెల వరుసలతో వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రం కాంతులీనింది. కార్తీక దీపాలతో శంభునికొండ శోభిల్లింది. భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం రాత్రి భక్తజన సామూహిక లక్షదీపోత్సవం నేత్రపర్వం చేసింది. గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆలయ వ్యవస్థాపకుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో కార్తీక దీపోత్సవం మొదలైంది. ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు దీపాలు వెలిగించి పునీతులయ్యారు. జెడ్పీటీసీ బాలమల్లుయాదవ్‌, సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి తదితరులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. ఉదయం దీపోత్సవ ప్రాంగణంలో ఆలయ వ్యవస్థాపకుడు చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు పూజలు నిర్వహించారు. జల ప్రోక్షణ చేశారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top