అంతరిక్షం వాసన: కాల్చిన మాంసమా? కాలిన ఇనుమా?

Smells Of Space - Sakshi

భూమ్మీద ఏ చోటకు వెళ్లినా అక్కడి వాతావరణం ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పరిసరాల్లో ఉండే పరిస్థితులను బట్టి ధ్వనులు వినిపిస్తుంటాయి. మట్టి నుంచి మొక్కలు, జంతువుల దాకా ఎక్కడికక్కడ వాసన, రుచి అనుభూతులు ఉంటాయి. మరి అంతరిక్షంలో ఎలాంటి ధ్వనులు వినిపిస్తాయి? అక్కడి రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా? దీనిపై పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చిన వివరాలు ఇవీ..

గెలాక్సీల మధ్య ధ్వని ప్రయాణం 
సాధారణంగా వాతావరణం లేనిచోట ధ్వని ప్రయాణించదు అనేది భౌతికశాస్త్ర సూత్రం. విశ్వంలో చాలా భాగం శూన్యమే కాబట్టి ధ్వని ప్రసారం ఉండదనే భావన ఉంది. ఇది కొంతవరకు నిజమే. అయితే వేలకొద్దీ నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు) ఉండే గెలాక్సీ  క్లస్టర్లు భారీ ఎత్తున గ్యాస్‌తో నిండి ఉంటాయి. వాటిలో ధ్వని ప్రయాణిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. 

అంతరిక్ష ధ్వనులను విడుదల చేసిన నాసా.. 
2003లో పెర్సెయస్‌ గెలాక్సీ క్లస్టర్‌ మధ్య ఉన్న ఒక కృష్ణ బిలం (బ్లాక్‌ హోల్‌) నుంచి వచ్చిన ధ్వనిని చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ఆ ధ్వని ఫ్రీక్వెన్సీని నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కొన్నికోట్ల రెట్లు పెంచారు. మనకు వినపడే స్థాయికి తీసుకొచ్చి విడుదల చేశారు. 

గ్రహాల ‘పాటలు’ ఇవి 
నాసా ప్రయోగించిన రోవర్లు, ఉపగ్రహాల సాయంతో పలు గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల ధ్వనులనూ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అంగారకుడు, శుక్రుడు, జూపిటర్, శనిగ్రహాలతోపాటు పలు తోకచుక్కల ధ్వనులను నమోదు చేశారు. పర్సవరెన్స్‌రోవర్‌ మార్స్‌పైచేసిన ప్రయోగాలతో.. అక్కడి పలుచని వాతావరణం కారణంగా ధ్వ­­ని­అతి మెల్లగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. వి­జిల్స్, గంటలు, పక్షుల కూతలు వంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ధ్వనులు దాదాపుగా వినిపించవని తేల్చారు. 

ఏదో కాలిపోతున్నట్టు వాసనతో.. 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్‌ వాక్‌ చేస్తుంటారు. అలా స్పేస్‌ వాక్‌ చేసి, తిరిగి ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లిన తర్వాత.. తమకు ‘ఏదో కాల్చిన మాంసం’.. ‘బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్‌ చేసినప్పుడు వెలువడే పొగ’ వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్‌ఎస్‌ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్‌ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్‌ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల  (హైఎనర్జీ వైబ్రేషన్స్‌)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్‌ఎస్‌లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్‌లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్‌ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు. 

‘టచ్‌’లో మార్పు లేదట! 
అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్‌ క్రిస్‌ హ్యాడ్‌ఫీల్డ్‌ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు. 

రకరకాల రుచుల్లో నక్షత్రాలు 
సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది. అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్‌ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్‌ ఫార్మేట్‌ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన ‘రాస్ప్‌బెర్రీ’ పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్‌గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు.  

కళ్లు ‘ఫ్లాట్‌’ అవుతాయట! 
అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపే వ్యోమగాముల్లో ‘స్పేస్‌ అసోసియేటెడ్‌ న్యూరో ఆక్యులర్‌ సిండ్రోమ్‌ (సాన్స్‌)’ సమస్య వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం వల్ల కళ్లలోని ఆప్టిక్‌ డిస్క్‌లో మార్పులు వచ్చి.. కళ్లు గుండ్రని ఆకారాన్ని కోల్పోతూ, దృష్టి సామర్థ్యం తగ్గుతోందని తేల్చారు.

- సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

ఇదీ చదవండి: భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును!

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top