చర్యలు తీసుకోవాలి
తనిఖీలు చేపట్టాలి
షాద్‌నగర్: షాద్‌నగర్, కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలకు ఎక్కడె క్కడ నుంచో వలస వచ్చి కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో చేరి తమ జీవితాలతో తామే చెలగాటమాడుకుంటున్నారు. జీతాలు సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పరిశ్రమల్లో పని చేసి రోగాల బారినపడిన కార్మికులెందరో. కార్మికచట్టాలను చట్టబండలుగా మార్చి యాజమాన్యాలు కార్మికుల జీవితాలతో ఆడకుంటున్న దుస్థితిని ఓసారి పరిశీలిద్దాం.
ఆరుతో మెదలై..
1975 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు షాద్‌నగర్ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతానికి శ్రీకారం చుట్టారు. దీంతో కొత్తూరు, నందిగామ, ప్రాంతాల్లో ఆరు పరిశ్రమలతో మొదలై సుమారు రెండు వందలకు పరిశ్ర మలు ఏర్పాటై పారిశ్రామిక ప్రాంతంగా రూపుదిద్దుకున్నాయి. ఇక షాద్‌నగర్, ఎలికట్ట, మొగిలిగిద్ద మధ్య గతంలో కొన్ని పరిశ్రమలు ఉండగా వ్యాపారులు ప్రభుత్వ రాయితీలతో మరిన్ని పరిశ్రమలను స్థాపించారు. ఇక్కడి పరిశ్రమల్లో సుమారు 40వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. యాజమాన్యాలు స్థానికులతో తలనొప్పి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకొని షెల్టర్ ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు.
కాలుష్య కాసారాలు
ఇక్కడ 30 శాతం పరిశ్రమలు కాలుష్యకారకాలే. స్పాంజ్, ఐరన్ పరిశ్రమలు ఎక్కువ ఈ పరిశ్రమల నుంచి వచ్చే పొగ కారణంగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు ఎలాంటి రక్షణ కల్పించకుండా పనులు చేయించుకుంటున్నారు. దీంతో వారు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వయసు పైబడిన తర్వాత కాళ్లు, చేతులు పనిచేయక నిస్తేజంగా మారుతున్నారు. రోగాల కారణంగా మృత్యువాత పడిన సంఘటనలెన్నో ఉన్నాయి. మృతుల కుటుంబాలకు సరైన పరిహారం ఇవ్వకుండానే మృతదేహాలను స్వరాష్ట్రాలకు పంపి చేతులు దులుపుకొంటున్నారు. కార్మికులు ఇతర రాష్ట్రాల వారు కావడం, ఇక్కడ వారికి పరిచయాలు లేకపోవడంతో ఏం జరిగినా అడిగే వారు లేరు.
ప్రమాదాల కొలిమి
ప్రమాదాలు సంభవించడం కార్మికులు మ్యత్యువాత పడడం సర్వసాధారణమైంది. ప్రమాదాల కారణంగా కార్మికులు మృత్యువాత పడితే ఆ విషయాన్ని బయటికి రాకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమల్లో పరిస్థితులను పరిశీలించడం లేదంటే ప్రమాదరహితంగా పరిశ్రమలు కొనసాగేలా చర్యలు తీసుకోవడం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రమాద ఘటనలు జరిగినప్పుడు కనిపించే ఆందోళనకారులు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోరాడడం లేదనే ఆరోపణలున్నాయి.
ప్రమాదాల పరంపర
● 2012లో షాద్‌నగర్ శివారులోని స్టీమ్ కోర్ పరిశ్రమలో బాయిలర్ పేలి 12 మంది కార్మికులు మృత్యువాత.
● 2015లో కొత్తూరు వినాయక స్టీల్ పరిశ్రమలో ఫర్నస్ పేలి పది మంది కార్మికులు మృత్యువాత.
● తీగాపూర్ శివారులోని పాత టైర్లను కాల్చే పరిశ్రమలో బాయిలర్ పేలి నలుగురి మృతి.
● నందిగామ పరిధిలోని శివశక్తి, జాగృతి, షాద్‌నగర్ పరిధిలోని ఎలికట్ట, మొగిలిగిద్ద శివారులో ఉన్న స్పాంజ్ ఐరన్ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో పదిమందికి పైగా కార్మికులు మృత్యువాత పడటంతో పాటు ఎంతో మంది గాయపడ్డారు.
● రెండేళ్ల క్రితం కాశిరెడ్డిగూడ శివారులోని కలర్ తయారీ పరిశ్రమలో సుమారు నలుగురు కార్మికుల మృతి.
● బూర్గుల శివారులోని గ్లాస్ తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృత్యువాత.
విషం చిమ్ముతున్న పరిశ్రమలు
ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు
పట్టించుకోని యాజమాన్యాలు, అధికారులు
ప్రశ్నార్థకంగా కార్మికుల జీవితాలు
పారిశ్రామిక ప్రాంతాల్లో పెగుతున్న కాలుష్యం కారణంగా ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. యాజమాన్యాల నిరక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రమాద సమయాల్లో హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి.
పరిశ్రమల కాలుష్యం తీవ్రమైంది. రాత్రి వేళల్లో పొగను బయటికి వదులుతున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడడంతో పాటు పంట పొలాలు దెబ్బతింటున్నాయి. కాలుష్య పరిశ్రమలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– బుడ్డ నర్సింహ, ఎలికట్ట, ఫరూఖ్‌నగర్
పరిశ్రమల్లో కార్మి కుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. యజమానుల నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు మృత్యువాత పడుతున్నారు.
– ఎన్.రాజు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ


