ఫిరంగి నాలా కబ్జాపై కదలిన యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

ఫిరంగి నాలా కబ్జాపై కదలిన యంత్రాంగం

Jul 3 2026 9:38 AM | Updated on Jul 3 2026 9:38 AM

ఫిరంగి నాలా కబ్జాపై కదలిన యంత్రాంగం డ్రగ్స్‌ నిషేధంపై పోస్టర్‌ ఆవిష్కరణ పోలీస్‌ పహారాలో ‘ఫార్మాసిటీ’ పనులు కేజీబీవీలో స్పాట్‌ అడ్మిషన్లు

ఇబ్రహీంపట్నం రూరల్‌: నాలా కబ్జాపై ఇరిగేషన్‌ అధికారులకు కదిలారు. ‘ఫిరంగి నాలా కబ్జా’ శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించారు. ఆదిభట్లలోని నాలా వద్దకు వెళ్లి పరిశీలించారు. ఇరిగేషన్‌ ఏఈ సునీత ఆధ్వర్యంలో జేసీబీ తెప్పించి నాలాలో నిర్మిస్తున్న ప్రహరీని కూల్చేందుకు ప్రయత్నించారు. రియల్టర్లు అడ్డుకొని తమ దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. కాలువలోనే బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు చేపట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు, జీహెచ్‌ఎంసీ డీసీలకు లేఖలు రాశారు. నూరు శాతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని పనులు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. తిరిగి చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: డ్రగ్స్‌ నిషేధంపై బీఆర్‌ఆర్‌ పౌండేషన్‌ చైర్మన్‌ బూడిద రాంరెడ్డి రూపొందించిన పోస్టర్‌ను గురువారం డీజీపీ సీవీ ఆనంద్‌ ఆవిష్కరించారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మత్తు నివారణ, డ్రగ్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిషేధం కోసం రాంరెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. బూడిద రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యం చేయడం ద్వారానే మత్తు పదార్థాలను నిషేధించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్స్‌, సైబర్‌ నేరాలకు దూరంగా యువత ఉండేలా చూడాలని డీజీకి సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు బంగ ఐలేష్‌, గోపాల్‌, నందకుమార్‌, మడుపు గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

యాచారం: పోలీస్‌ పహారాలో ఫార్మాసిటీ భూముల్లో భూ చదును, కంపచెట్ల తొలగింపు పనులు జోరుగా సాగుతున్నాయి. ఫార్మాసిటీ గ్రామాలైన నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో గురువారం రెండో రోజు కూడా రైతులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందే పసిగట్టిన పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్మాసిటీ భూముల వైపు ఎవరినీ రాకుండా కట్టడి చేశారు. ఆందోళనలు, నిరసనలు చేపట్టిన రైతులను అరెస్టు చేసి గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం వదిలి పెట్టారు.

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కేజీబీవీ) 2026–27 ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో స్పాట్‌ అడ్మిషన్లు కొనసాగుతున్నట్లు విద్యాలయం స్పెషలా ఫీసర్‌ శైలజ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026లో పదో తరగతి ఉత్తీర్ణులైన, గ్రామీణ నిరుపేద, అనాథ, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్థులు 15 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు గలవారై ఉండాలన్నారు. విద్య, వసతి, భోజనం, పాఠ్య, నోట్‌ పుస్తకాలు, యూనిఫాం ఉచితంగా అందజేస్తామని, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ సౌకర్యాలున్నట్లు చెప్పారు. సంబంధిత ధ్రువపత్రాలతో హాజరైతే వెంటనే అడ్మిషన్లు ఇస్తామని ఆమె చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement