ఇబ్రహీంపట్నం: పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్స్ విడుదల చేసి, భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో గురువారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్‌తో కలిపి కేవలం 55 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. ఇంకా 1,45,000 భర్తీ చేయాల్సి ఉందన్నారు. జాబ్ క్యాలెండర్‌ను నామమాత్రంగా విడుదల చేసి చేతులు దులుపుకొందని, నిరుద్యోగులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తోందని విమర్శించారు. వేలాది రూపాయలు ఖర్చుపెడుతూ కోచింగ్ సెంటర్స్‌కు వెళ్లి ఉద్యోగాల సాధనకు సన్నద్ధం అవుతున్న యువత, నిరుద్యోగులు నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, లేనిపక్షంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.జగన్, నాయకులు జంగయ్య, శివశంకర్, మహేశ్, భాస్కర్, గిరి పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేశ్


