రెండు బైక్‌లు ఢీ.. ఒకరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. ఒకరి దుర్మరణం

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

బాలానగర్‌: రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు మృతి చెందిన సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం... దేవమ్మ బస్తీకి చెందిన ముద్గుల ప్రశాంత్‌(28) ఇంటీరియర్‌ డిజైనర్‌. తన స్నేహితుడు మునగాల తారక్‌(23)తో కలిసి బైక్‌పై జగద్గిరిగుట్ట వైపు వైళ్తున్నాడు. బీజేఆర్‌ నగర్‌లోని నిజాం హోటల్‌ సమీపంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన మరో బైక్‌ ఢీకొట్టింది. బైక్‌ వెనుక కూర్చున్న ప్రశాంత్‌ రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే ప్రశాంత్‌, తారక్‌లను సమీపంలోని బి.బి.ఆర్‌. ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ప్రశాంత్‌ మృతి చెందినట్లు చెప్పారు. హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని పోలీసులు తెలిపారు. ప్రశాంత్‌ సోదరి నందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

20 తులాల నగలు చోరీ

ప్రైవేట్‌ బస్సులో నగరానికి వస్తుండగా ఘటన

అఫ్జల్‌గంజ్‌: అనంతపురం నుంచి ప్రైవేట్‌ బస్సులో నగరానికి వస్తున్న మహిళకు చెందిన బ్యాగులోంచి 20 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన కీర్తన కుటుంబసభ్యులతో కలిసి నగరానికి వచ్చేందుకు ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్‌ బస్సు ఎక్కారు. మరుసటి రోజు నగరానికి చేరుకున్న అనంతరం బ్యాగు చెక్‌ చేసుకోగా ఆభరణాలు చోరీకి గురైనట్లు గ్రహించారు. బస్సులో వెతికినా ఫలితం లేకపోవడంతో అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి..

బాధితుడిని బెదిరిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు

బంజారాహిల్స్‌: ఓ వ్యక్తికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించిన ఓ మహిళతోపాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు... బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–11లోని ఉదయ్‌నగర్‌లో నివాసం ఉండే శశికాంత్‌కు గుర్తుతెలియని వాట్సాప్‌ వీడియో కాల్‌ వచ్చింది. తన పేరు అంజలిశర్మ అని పరిచయం చేసుకుంది. వీడియో కాల్‌లోనే శశికాంత్‌ ఫొటోలను క్యాప్చర్‌ చేసింది. అనంతరం అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియా ప్రచారం చేస్తామని బెదిరించింది. ఆమెతోపాటు దినేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి తాను ఢిల్లీ సైబర్‌ క్రైమ్‌ పోలీసునని, రాహుల్‌ అనే వ్యక్తి కూడా ఫోన్‌ చేసి తాను మీడియా ప్రతినిధినంటూ శశికాంత్‌ను బెదిరించి విడతలవారీగా రూ.1.67 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయించుకున్నారు. పదేపదే బెదిరిస్తుండటంతో బాధితుడు నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీసాల పేరిట మోసం.. ఇద్దరి అరెస్టు

బంజారాహిల్స్‌: వర్క్‌ వీసాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగిస్తున్న ఇద్దరిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... ట్రివియల్‌ చాప్టర్‌ ఉపాధ్యక్షురాలిగా పరిచయం చేసుకుంటున్న లంక నిరుపమ, అదే సంస్థ రీజినల్‌ మేనేజర్‌గా చెప్పుకుంటున్న మామిడి అరుణ్‌రాజ్‌ యూరప్‌(గ్రీస్‌, రొమేనియా)లో వర్క్‌ వీసాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. నకిలీ ఆఫర్‌లెటర్లు ఇచ్చి, ఆపై ఫోన్‌కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించకుండా తప్పించుకుంటున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రొఫెషనల్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీకి చెందినవారమని ప్రచారం చేసుకుంటున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్‌ లైసెన్స్‌(ఆర్‌ఏ లైసెన్స్‌) లేకపోయినా గ్రీస్‌, ఇటలీ, సెర్పియా వంటి దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితులను నమ్మించారు. ఆ మేరకు భారీగా డబ్బులు వసూలు చేసి నమ్మకం కలిగించడానికి ఆన్‌లైన్‌లో టెంప్లెట్ల ద్వారా సృష్టించిన నకిలీ వర్క్‌ ఆథరైజేషన్‌ లేఖలను ఇచ్చేవారు. గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడటంతో కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. వీరికి సహకరించిన మొత్తం 8 మంది పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement