కౌకుంట్ల గ్రామస్తుల తీర్మానం
చేవెళ్ల: తమ గ్రామంలో బెల్టుషాపుల నిషేధానికి తీర్మానం చేశామని.. తమకు సహకరించాలని కౌకుంట్ల గ్రామస్తులు అధికారులను కోరారు. సోమవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ హిమబిందు, ఎకై ్సజ్ కార్యాలయంలో ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్‌ను సర్పంచ్ బి.మల్లారెడ్డి పాలకవర్గంతోపాటు మహిళా సంఘాలు, యువజన సంఘాల సభ్యులు కలిసి తీర్మాన పత్రాలు అందించారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి రోజు నుంచి మద్యపాన నిషేధం చేయాలని తీర్మానించినట్టు చెప్పారు. గ్రామంలో మంగళవారం నుంచి బెల్టుషాపులు నిర్వహించిన వారికి రూ.లక్ష, బెల్టుషాపులో మద్యం కొనుగోలు చేసిన వారికి రూ.50వేల జరిమానా విధించటం జరుగుతుందన్నారు. బెల్టుషాపుల నిర్వహణను పట్టించిన వారికి రూ.10వేల బహుమతిని ప్రకటించారు. పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుందన్నారు. కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువగా కలిపి అమ్ముతున్నారని దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్తుల ప్రయత్నాన్ని అధికారులు అభినందించారు. తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మండల రైతులు
ధారూర్: మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు రైతులు కలెక్టర్ దీపక్ తివారిని కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మండల పరిధిలోని తరిగోపుల, నాగ్‌సాన్‌పల్లి, మైలారం తదితర గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.2,400 ప్రకటించిందన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,900 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని వారు వాపోయారు. దీంతో ప్రతి క్వింటాళుకు రూ.500 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని వారు కోరారు.
విద్యతోనే అసమానతలు దూరం
నవాబుపేట: విద్యతోనే అసమానతలు తొలగి అభివృద్ధికి బాటలు పడతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను స్పీకర్ ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రపంచంతో పోటీపడి చదవాలన్నారు. పోరాడి హక్కులను సాధించుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్య ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని నాటి ఉద్యమాలను నెమరు వేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మనలో మనకు ఉన్న తారతమ్యాలను వదిలేసి.. ఐక్యంగా ముందుకు సాగి హక్కులు దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. నేడు ప్రతి ఒక్కరికీ విద్య ఎంతో అవసరం అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి.. వారిని అభివృద్ధిలో భాగస్వాములు చేయాలన్నారు. ఉపాధి హామీ, విద్య, భూముల సీలింగ్ ఇలాంటి ఎన్నో చట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఫలాలు అందుకొని అందరూ అభివృద్ధి చెందాలని సూచించారు. అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు జీవితంలో ముందడుగు వేయాలన్నారు. వారి జీవిత చరిత్రలే మనకు పాటలు కావాలన్నారు. పేదల పక్షపాతి అంబేడ్కర్ అన్నారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, జగ్జీవన్ రాములు జన్మించిన ఏప్రిల్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సింది బాధ్యత విద్యార్థులు, యువతపై ఉందన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. అంబేడ్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో గాయకుడు వేపూరి సోమన్న, ఏఎంసీ చైర్మన్ గీతా సింగ్ నాయక్, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, సంఘం మండల అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, సర్పంచి నరసింహారెడ్డి, అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఆనందం, సభ్యులు శివరాజ్, వెంకటేశ్వరరావు, జాన్, ఏసుదాసు, రత్నం, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.


