ఎవరి పురమో! | - | Sakshi
Sakshi News home page

ఎవరి పురమో!

Feb 13 2026 5:37 AM | Updated on Feb 13 2026 5:37 AM

ఎవరి పురమో!

ఎవరి పురమో!

రిజర్వేషన్లు ఇలా..

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా ఉన్న అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలై.. మధ్యాహ్నం రెండు గంటల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌, తర్వాత వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే పోలింగ్‌ బూతుల వారీగా నమోదైన ఓట్లపై అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చారు. గెలిచి తీరుతామనే ధీమాతో ఉన్న వాళ్లు ఫలితం వెలువడిన వెంటనే భారీ విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోటాపోటీ ఉన్న వార్డుల్లో మాత్రం అభ్యర్థులు టెన్షన్‌తో తలపట్టుకుంటున్నారు. ఓటరు మహాశయులు ఎటువైపు మొగ్గు చూపారో తెలియక అయోమయంలో ఉన్నారు. కనిపించిన దేవుడికల్లా ముడుపులు కట్టేసి ఎలాగైనా తమను గెలిపించాలని వేడుకున్నారు.

సిబ్బంది నియామకం

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉండగా, వీటిలో 274 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు మొత్తం 437 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 68,725 మంది పురుషులు, 70,318 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లులో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 265 మందిని నియమించారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రత

అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలులో ఉంటుందని ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమికూడటం నిషేధమని తెలిపారు. శాంతి భద్రతల కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫలితాలు వెల్లడైన వెంటనే చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రారంభం కానుంది. ఈ నెల 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, చేవెళ్ల మున్సిపాలిటీలు జనరల్‌కు రిజర్వు కాగా, షాద్‌నగర్‌ బీసీ జనరల్‌కు, మొయినాబాద్‌ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి. జనరల్‌ స్థానాల్లోనూ మహిళలకు అవకాశం కల్పించాలనే ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్లు తెలిసింది.

మొయినాబాద్‌: కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద సూచనలు చేస్తున్న అధికారులు

నేడే మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు

64 టేబుళ్లు.. 265 మంది సిబ్బంది

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మున్సిపాలిటీల వారీగా నమోదైన పోలింగ్‌

మున్సిపాలిటీ వార్డులు మొత్తం ఓటర్లు పోలైనవి

ఆమనగల్లు 15 16,984 14,403

చేవెళ్ల 18 25,371 20,661

ఇబ్రహీంపట్నం 24 25,993 20,392

మొయినాబాద్‌ 26 32,871 26,377

శంకర్‌పల్లి 15 21,401 16,498

షాద్‌నగర్‌ 28 53,403 40,713

ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే..

ఆమనగల్లు బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌

చేవెళ్ల ఫర్హా ఇంజనీరింగ్‌ కాలేజీ

ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు ఇంజనీరింగ్‌ కాలేజీ

మొయినాబాద్‌ మ్యాక్‌ ఫార్మసీ కాలేజీ

షాద్‌నగర్‌ మినీ స్టేడియం

శంకర్‌పల్లి మున్సిపల్‌ ఆడిటోరియం బిల్డింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement