సర్పంచ్ సస్పెన్షన్ అన్యాయం
● కలెక్టర్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
● గిరిజన సంఘాల నేతల డిమాండ్
పంజగుట్ట: మోకిలతండా సర్పంచ్ శాంతమ్మను సస్పెండ్ చేయడం అన్యాయమని, కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉప సంహరించుకోవాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి గౌరవాధ్యక్షుడు బానోతు మంగీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని స్పష్టంచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్ చౌహాన్, తొలగింపునకు గురైన సర్పంచ్ శాంతాబాయితో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12వేల మంది సర్పంచ్‌లు ఉండగా ఎలాంటి కారణం లేకుండా ఒక గిరిజన మహిళా సర్పంచ్‌ను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌ను కేవలం పంచాయతీ పరిధిలో చెట్లను తొలగించారన్న కారణంతో పదవి నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై గిరిజన మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి స్పందించి వెంటనే సస్పెన్షన్‌ను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాంతమ్మ మాట్లాడుతూ.. తనపై కక్షగట్టి ఇలా చేశారన్నారు. తాను ఎంతో కష్టపడి ఇండిపెండెంట్‌గా గెలిచానని, సస్పెన్షన్‌ను రద్దు చేసి, న్యాయం చేయాలని కోరారు.
కలెక్టరేట్ వద్ద నిరసన
శంకర్‌పల్లి: మోకిల తండా సర్పంచ్ వర్త్య శాంతమ్మ విధులు దుర్వినియోగం చేశారని ఇటీవల కలెక్టర్ నారాయణరెడ్డి ఆమెను ఆరునెలల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై భారతీయ గోర్ బంజారా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. సర్పంచ్‌గా గెలిచి మూడు నెలలు కాక ముందే గిరిజన మహిళను పదవి నుంచి తొలగించడం బాధాకరమని అన్నారు. సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్‌కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరైన విచారణ లేకుండానే కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, దీనిపై త్వరలో రాష్ట్ర, జాతీయ నాయకులను కలవనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు బాబునాయక్, నారియా, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.


