
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
నందిగామ: పాత జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన నందిగామ శివారు నూజివీడు పరిశ్రమ సమీపంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పరిశ్రమ సమీపంలోని రోడ్డు పక్కన చెట్ల పొదల్లో ఓ వ్యక్తి(65) మృతదేహం ఉందన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.
బాలికపై లైంగికదాడి
ఇద్దరిపై కేసు నమోదు
యాచారం: ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి నందివనపర్తి గ్రామానికి చెందిన మైనర్(14)ను అదే గ్రామానికి చెందిన జి.క్రాంతి, బి.క్రాంతిలు రాత్రి వేళలో మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. సమాచారం మేరకు అదే రాత్రి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆదివారం ఇద్దరిపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ, పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
ప్రమాదవశాత్తు ఆపరేటర్ మృతి
ఆమనగల్లు: ప్రమాదవశాత్తు ఆపరేటర్ మత్తి చెందిన సంఘటన తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి గ్రామానికి చెందిన బాషామోని మహేశ్(25).. నాలుగేళ్లుగా శ్రీ వేంకటేశ్వర మినరల్స్ కంపెనీలో ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం విధి నిర్వహణలో భాగంగా ఒక లారీలో పౌడర్‌ను లోడ్ చేశారు. తిరిగి వచ్చే క్రమంలో డ్రైవర్ వెంకటేశ్వర్లు లారీని నిర్లక్ష్యంగా ముందుకు తీయగా.. మహేశ్ ఫోర్క్ లిఫ్ట్ కింద పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
దోమ: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రే కీలకమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలోని ఆయన నివాసంలో జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించారు. దిర్సంపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రూప్‌సింగ్‌కు ఇటీవలే జీహెచ్‌ఎంగా పదోన్నతి లభించడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం