గిరగిరా!
మూడు చక్రాలు
● 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలకు అనుమతి
● ఇప్పటికే సిటీ రోడ్లపై 1.25 లక్షల ఆటోలు
గ్రేటర్‌లో కొత్తగా 65 వేల ఆటో పర్మిట్లు
సాక్షి, సిటీబ్యూరో: వాహన కాలుష్య నియంత్రణ పేరిట ప్రభుత్వం ఆటో పర్మిట్ల జాతరకు తెర తీసింది. ఎలక్ట్రిక్ ఆటోలు, సీఎన్జీ, ఎల్పీజీ, రిట్రోఫిట్‌మెంట్ విభాగాల్లో మొత్తం 65 వేల ఆటోలు కొత్తగా రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో సుమారు 1.25 లక్షల ఆటోలు తిరుగుతున్నాయి. వివిధ జిల్లాలకు చెందిన మరో 30 వేలకుపైగా ఆటోలు ఇక్కడ నడుస్తున్నాయి. విస్తరిస్తున్న నగర అవసరాల దృష్ట్యా, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ లేని 65 వేల ఆటోలకు అనుమతి లభించింది.
రోడ్డెక్కనున్న 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు..
ప్రస్తుతం తిరుగుతున్న డీజిల్, పెట్రోల్ వాహనాలతో తీవ్రమైన కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి. ఎల్పీజీ, సీఎన్జీతో నడిచే వాహనాల్లోనూ కల్తీ ఇంజినాయిల్ వినియోగిస్తున్నారు. దీంతో ఆటో కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్తగా అనుమతినిస్తున్న వాటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి. మరో 10 వేల ఎల్పీజీ ఆటోలు, 10 వేల సీఎన్జీ ఆటోలకు కూడా ప్రభుత్వం కొత్తగా అనుమతులను ఇవ్వనుంది. ఇవి కాకుండా డీజిల్, పెట్రోల్‌తో నడిచే 25 వేల ఆటోలను సీఎన్జీ, ఎల్పీజీకి మార్చుకొనేందుకు రిట్రోఫిట్‌మెంట్ అనుమతులను కూడా ఇచ్చారు. దీంతో 65 వేల ఆటో రిక్షాలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆటోలను ఔటర్ వరకు అనుమతిస్తారు.
భూరేలాల్ సిఫార్సులకు బురిడీ..
గ్రేటర్‌లో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అప్పటి ప్రభుత్వం భూరేలాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆటో రిక్షాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్తగా ఎలాంటి పర్మిట్లను ఇవ్వరాదని ఈ కమిటీ 2002లోనే సిఫార్సు చేసింది. అప్పటి నుంచి కొంతకాలం నిలిపివేశారు. ఆ తర్వాత క్రమంగా నిషేధాన్ని సడలిస్తూ తెలంగాణ ఏర్పాటుకు ముందే 25 వేలకు పైగా పర్మిట్లు ఇచ్చారు. కాలం చెల్లిన వాహనాల పర్మిట్లపై కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఇదంతా నగరంలోని బడా ఫైనాన్షియర్‌లు, ఆటోమొబైల్ డీలర్లు, దళారుల అక్రమార్జనకు ఊతమిచ్చింది.
ఫైనాన్షియర్లకు అక్రమాలకు ఊతం..
అప్పట్లో సుమారు రూ.100 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం సుమారు లక్ష పర్మిట్లు ఫైనాన్షియర్‌ల గుప్పెట్లోనే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా పర్మిట్లు ఇచ్చిన ప్రతిసారి ఆటోరిక్షా ధరలను పెంచేస్తారు. పేద ఆటోడ్రైవర్‌ల నుంచి ఇష్టారాజ్యంగా అక్రమ వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేస్తారు. దీంతో అప్పులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆటోకార్మికులు తమ వాహనాలను తిరిగి ఫైనాన్షియర్‌లకే అప్పగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆటోపర్మిట్లు మొదటి నుంచి ఫైనాన్షియర్‌ల అక్రమార్జనకు అవకాశంగా మారాయి. ప్రభుత్వం మరోసారి సామాన్య, పేద డ్రైవర్లపై ఫైనాన్షియర్లు నిలువుదోపిడీకి పాల్పడే పర్మిట్ల బేరానికి తెరతీసింది.


