
గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు
గాంధీ ఆస్పత్రి :
మరోసారి వేగంగా వ్యాపిస్తున్న కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు సూచించారు. రాష్ట్ర నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశామని, కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. థర్డ్‌వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్– 1 ప్రస్తుతం వ్యాప్తిలో ఉందని, కానీ.. ఇది ప్రమాదకారి కాదన్నారు.
దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్ మూడు స్టేజ్‌లు ఉంటాయని, కరోనా వైరస్ వీటిలో చివరిదైన ఎండమిక్ స్టేజ్‌లో ఉందన్నారు. రెస్పరేటరీ వైరస్‌లలో కోవిడ్ పాజిటివ్ కేసులు 60శాతం ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కోవిడ్ వైరస్‌ను ప్రాణాంతకమైన మహమ్మారిలా చూసే పరిస్థితి లేదని, జలుబు, దగ్గు వంటి సాధారణ రుగ్మతగానే వచ్చిపోతుందని, గతంలో వేసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోయినప్పటికీ, ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందన్నారు.
చిన్నారుల్లో నమోదు కావడం లేదు
ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్‌తో పాటు మన దేశంలోని మహారాష్ట్రలో వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్–1 వైరస్ చిన్నారుల్లో నమోదు కావడంలేదు. ఒమిక్రాన్ బీఏ.2.86 నుంచి రూపాంతరం చెందిన జేఎన్–1లో మూడు సబ్ వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, పీసీ.2.1, ఎక్స్‌ఈసీ.25.1లు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. మహారాష్ట్రలో జేఎన్–1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కానీ ఇది ప్రమాదకారి కాదు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మాస్క్‌లు ధరించి అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.
– ప్రొఫెసర్ కిరణ్ మాదల,
క్రిటికల్ కేర్ మెడిసిన్

గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు