
కర్షకుల కష్టం వర్షార్పణం!
యాచారం: నిబంధనల సాకు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. వెరసి కర్షకుల కష్టం వర్షార్పణం అవుతోంది. పండించిన ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజులు గడుస్తున్నా.. కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రైతులు వడ్ల కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు వడ్లను కాపాడుకునేందుకు భగీరథ యత్నం చేస్తున్నారు. యాచారం మండలం మల్కీజ్‌గూడ, యాచారం, చౌదర్‌పల్లి గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని యాచారం కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. అధికారులు సేకరించకపోవడంతో బుధవారం కురిసిన వర్షానికి తడిసిపోయింది. ధాన్యంపై కవర్లు కప్పినప్పటికీ.. భూమి పదునుతో ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి వానలు కురిస్తే ధాన్యంపై ఆశలు వదులుకోవాల్సిందేనని వాపోతున్నారు.