
దేవుడు పంపిన ‘అమ్మ’
మీర్‌పేట: వివాహమైన కొన్నేళ్లకు కూడా పిల్లలు కాకపోవడంతో అనాథ పాపను దత్తత తీసుకుంది. చిన్నారికి అనారోగ్య సమస్య ఉందని తెలిసినా, భర్త సహకారంతో పాపను పెంచి పెద్దచేసింది. అమ్మా అనే పిలుపు కోసం ఆతల్లి పడిన వేదన మాతృత్వంలోని మమకారాన్ని చాటిచెప్పింది. తన బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పించి, సొంతకాళ్లపై నిలబడేందుకు ఎంతో కృషి చేసింది. అనంతరం ఆమెకు వివాహం చేయడంతో పాటు పుట్టిన ఇద్దరు మనవరాళ్ల ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆమే నందిహిల్స్‌కు చెందిన విజయలక్ష్మి. వివాహమైన కొన్నేళ్లు గడిచినా పిల్లలను పుట్టకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. తనకు ఆడపిల్లనే కావాలని కోరింది. స్టేట్ హోమ్ నుంచి ఓ పాపను దత్తత తీసుకుంది. ఇంటికి తెచ్చుకున్న తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఆస్పత్రుల చుట్టూ తిప్పింది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడింది. భర్త యాదయ్య సహకారంతో తన కూతురుకు విద్యాబుద్ధులు నేర్పించి, నచ్చిన రంగంలో ఆమెను ప్రోత్సహించింది. అనంతరం తగిన వరున్ని చూసి వివాహం చేసింది. అల్లుడు, కూతురిని తనవద్దే పెట్టుకుంది. ప్రస్తుతం విజయలక్ష్మి బిడ్డకు ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. వీరిని కూడా ఆమే చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.