
నవ వధువు ఆత్మహత్య
కొందుర్గు: కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొందుర్గు మండల పరిధిలోని వెంకిర్యాలలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం ఎన్కెపల్లికి చెందిన కప్పరి మన్యం, సుగుణమ్మల కూతురు సుజాత(21)ను , మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లింగంపల్లికి చెందిన రాములుకు ఇచ్చి గత నెల 7న వివాహం జరిపించారు. ఈ సమయంలో వరకట్నం కింద అరతులం బంగారు అభరణాలు, స్కూటీ కొనుక్కునేందుకు రూ.70 వేల నగదుతోపాటు వంట సామగ్రి అందజేశారు. అయితే పెళ్లి జరిగిన రోజునుంచి భర్త రాములుతో పాటు మామ పోచయ్య, బావ సైదులు ఆమెను మానసికంగా బాధపెడుతున్నారు. పెళ్లికి రూ.6 లక్షలు ఖర్చు అయ్యిందని, ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుంచి తేవాలని సుజాతను ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మన్యం, సుగుణమ్మ వెంకిర్యాలలోని తమ సమీప బంధువు రామకృష్ణకు చెందిన టీ స్టాల్‌లో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నారు. గురువారం వెంకిర్యాలకు వచ్చిన సుజాత రాత్రి వేళ వద్ద బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మన్యం ఫిర్యాదు మేరకు తహసీల్దార్ రమేశ్‌కుమార్ సమక్షంలో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ బాలస్వామి తెలిపారు. ఇదిలా ఉండగా సుజాత అంత్యక్రియలను అత్తగారి గ్రామమైన లింగంపల్లిలో నిర్వహించారు.
వరకట్న వేధింపులతో మనస్తాపం
ఉరేసుకుని బలవన్మరణం