కేసులపేరు చెప్పికాసులు స్వాహా | - | Sakshi
Sakshi News home page

కేసులపేరు చెప్పికాసులు స్వాహా

Mar 14 2025 7:44 AM | Updated on Mar 14 2025 7:44 AM

కేసులపేరు చెప్పికాసులు స్వాహా

కేసులపేరు చెప్పికాసులు స్వాహా

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌కు చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగిని (65) టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు కేసుల పేరు చెప్పి కాసులు దండుకున్నారు. దుర్భాషలాడిన ఆరోపణలపై కేసు నమోదయ్యిందంటూ మొదలెట్టిన కేటుగాళ్లు మనీలాండరింగ్‌, మనుషుల అక్రమ రవాణా వరకు తీసుకెళ్లారు. మధ్యలో రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌, చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి పంపారు. రిఫండ్‌ చేస్తామంటూ ఆమె నుంచి రూ.23 లక్షలు కాజేశారు. నాలుగు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించిన బాధితురాలు ఎట్టకేలకు తాను మోసోయినట్లు గుర్తించి గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..బాధితురాలికి ఇటీవల టెలికాం డిపార్ట్‌మెంట్‌ అధికారి పేరుతో ఫోన్‌ వచ్చింది. ఆమె ఆధార్‌కార్డు వినియోగించి సిమ్‌కార్డు ద్వారా అనేక మందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ కాల్స్‌ చేశారని ఈ మేరకు కేసు నమోదైందని చెప్పారు. కాల్‌ను బెంగళూరుకు చెందిన ఎస్సై అంటూ మరో వ్యక్తికి బదిలీ చేశాడు. కొన్ని ప్రత్యేక విభాగాలను మినహాయిస్తే దేశంలో ఏ పోలీస్‌ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్‌ను దాని సీరియల్‌ నెంబర్‌/ఏ ఏడాది విధానంలో నమోదు చేస్తారు. అయితే బాధితురాలికి మాత్రం బీకే354ఏ/0125 నెంబర్‌తో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందంటూ చెప్పిన నకిలీ ఎస్సై తక్షణం తమ వద్ద హాజరుకావాలని చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన ఆమె తాను ఎలాంటి నేరాల్లోనూ పాలు పంచుకోలేదని, వయస్సు రీత్యా బెంగళూరు వరకు ప్రయాణం చేయలేనని వేడుకున్నారు. దీంతో సదరు సైబర్‌ నేరగాడు ఈ కేసు సైబర్‌ క్రైమ్‌ విభాగానికి బదిలీ అయ్యిందని, అక్కడ నుంచి ఓ ఉన్నతాధికారి సంప్రదిస్తారని చెప్పాడు. ఆపై బాధితురాలికి కాల్‌ చేసిన వ్యక్తి తాను ఐపీఎస్‌ అధికారినంటూ మాట్లాడాడు. తాము ఢిల్లీలో సదాసత్‌ ఖాన్‌ అనే నేరగాడిని పట్టుకున్నామని, అతడి విచారణలోనే బాధితురాలి పేరుతో ఉన్న ఆధార్‌కార్డు, దానికి లింకై ఉన్న బ్యాంకు ఖాతా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. ముంబైలో తెరిచిన ఆ బ్యాంకు ఖాతాను మనీ లాండరింగ్‌ కోసం వాడినట్లు చెప్పి భయపెట్టాడు. అదే ఖాతాను మనుషుల అక్రమ రవాణా ముఠాలు వినియోగించాయని చెప్పాడు. ఇన్ని కేసులు నమోదైన నేపథ్యంలో బాధితురాలి పేరును వాటి నుంచి తొలగించడానికి కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఆ చెల్లింపు అనివార్యం అంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ పేరుతో రూపొందించిన నకిలీ లేఖ పంపాడు. తన ఖాతాల్లో డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని మూడు రోజుల్లో వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి రిఫండ్‌ చేస్తామని నమ్మబలికాడు. దీంతో ఆమె కొంత మొత్తం బదిలీ చేశారు. ఆపై తన డబ్బు రిఫండ్‌ చేయమంటూ పదేపదే ఫోన్లు చేశారు. ఈసారి సైబర్‌ నేరగాళ్లు చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో సృష్టించిన మరో లేఖ పంపారు. అందులోనూ నగదు చెల్లించాలని, రిఫండ్‌ అవుతుందని ఉంది. నిజమని నమ్మిన బాధితురాలు మరికొంత మొత్తం చెల్లించారు. ఇలా నాలుగు దఫాల్లో మొత్తం రూ.23 లక్షలు బదిలీ చేశారు. కొన్ని రోజుల రిఫండ్‌ విషయం ఆరా తీస్తూ బాధితురాలు ఫోన్‌ చేయగా... నగదు రిఫండ్‌ వస్తుందని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో కుటుంబీకులతో సహా ఎవ్వరికీ చెప్పద్దని చెప్పాడు. ఎవరికి చెప్పినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపెట్టాడు. ఎట్టకేలకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.

దూషణ నుంచి మనుషుల అక్రమ రవాణా వరకు వినియోగం

రీఫండ్‌ చేస్తామని బాధితురాలి నుంచి రూ.23 లక్షలు స్వాహా

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌, సీజేఐ పేర్లతో నకిలీ లేఖలు

సీసీఎస్‌లో కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement