
నందిగామ: బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మండల పరిధిలోని మామిడిపల్లిలో హోంమంత్రి నిధులు రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు చేయలేని అనేక అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. గ్రామాల్లో హరితహారం, మిషన్ భగీరథ ద్వారా నీరు, ప్రతీనెల క్రమం తప్పకుండా నిధులు, పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ట్రాక్టర్లు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు నిర్మించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచులు కవిత, చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి, బేగ్, శ్రీపాల్ రెడ్డి, శరత్, సాయి, మురళి తదితరులు పాల్గొన్నారు.
హోంమంత్రి మహమూద్ అలీ