
వేలాడే వైర్లకు తగిలి ఆరు ఎద్దుల మృత్యువాత
ఆమనగల్లు: వేలాడే విద్యుత్ తీగలు ఆరు ఎద్దులను బలితీసుకున్నాయి. ఈ హృదయవిదారక ఘటన మాడ్గుల మండలం నల్లచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో పొలాల్లోని విద్యుత్ తీగలు కిందకు వేలాడాయి. గురువారం ఉదయం పలువురి రైతులకు చెందిన ఎద్దులు అటువైపు వెళ్తుండగా విద్యుత్ వైర్లు తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. గ్రామానికి చెందిన కట్ట అంజయ్యకు చెందిన రెండు ఎద్దులు, పోచయ్యకు చెందిన రెండు ఎద్దులు, సాంబయ్యకు చెందిన ఎద్దు, యాదయ్యకు చెందిన ఓ ఎద్దు మృత్యువాత పడ్డాయి. ఎద్దులు మృతితో రైతులు బోరున విలపించారు. ప్రభుత్వపరంగా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంఘటనాస్థలాన్ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సందర్శించి రైతులను పరామర్శించారు. వ్యక్తిగతంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. అలాగే సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి బాధిత రైతులకు ఎద్దుకు రూ.5 వేల చొప్పున రూ.30 వేల ఆర్థికసాయం అందించారు.