దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి  - Sakshi

మీర్‌పేట: రాష్ట్రం సాధించిన తరువాత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతి ప్రతి ఒక్కరికీ తెలిసేలా వాడ వాడలా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖా మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. మీర్‌పేటలోని ఎస్‌వైఆర్‌ గార్డెన్స్‌లో గురువారం జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గస్థాయి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు 20 రోజుల పాటు పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇళ్ల పట్టాలు, గొర్రెల పంపిణీ, న్యూట్రిషన్‌ కిట్లు, హరితహారం, కులవృత్తుల వారికి రూ.లక్ష అందించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మన ఊరు–మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిని, నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్‌, డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ పాఠశాలల వివరాలను ఫొటోల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. పాఠశాలల్లో చిత్రలేఖనం, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించాలన్నారు. మన ఊరు–మనబడిలో సిద్ధంగా ఉన్న పాఠశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్‌ తరగతి గదులను ప్రారంభించడంతో పాటు ఈనెల 20న విద్యార్థులకు నోటు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని చెరువుల వద్ద ఉత్సవాలు నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, చేపలు, గొర్రెలు, ఇతర పథకాలను గ్రామాల్లో ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కింద మంజూరైన నిధుల వివరాలను మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేసి ప్రత్యేక తీర్మానాలు చేయాలని, దేవాలయాలు, మసీదులు, చర్చిలను విద్యుత్‌ కాంతులతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, మీర్‌పేట మేయర్‌ ఎం.దుర్గాదీప్‌లాల్‌చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, మండల, మున్సిపాలిటీలు, డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అధికారులతో సమీక్ష

మహేశ్వరం: దశాబ్ది ఉత్సవాలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియోజకవర్గ అధికారులతో సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఉత్సవాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమావేశంలో కందుకూరు ఆర్డీఓ సూరజ్‌కుమార్‌, మహేశ్వరంజోన్‌ డీసీపీశ్రీనివాస్‌, ఏసీపీ అంజయ్య, ఏడీఏ సుజాత, డీఈ శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్‌ తహసీల్దార్లు మహమూద్‌ అలీ, మహేందర్‌రెడ్డి, ఏఈఓ కృష్ణ, ఎంపీడీఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మంత్రి సబితారెడ్డి

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top