
షాద్‌నగర్: బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనపై ప్రజల్లో అవగాహన కల్పించి, బడి బయటి పిల్లలను స్కూల్లో చేర్చే విధంగా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు గాను ఈనెల 3 నుంచి 17 వరకు ‘బడిబాట’ పట్టనున్నారు.
ఇవీ లక్ష్యాలు
● బడీడు పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో నమోదు చేయడం.
● ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచడం, గుణాత్మక విద్యను అందించడం.
● సమాజ భాగస్వామ్యంతో పాఠశాలలను బలోపేతం చేయడం.
● అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్ల పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం.
● విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్‌డేట్ చేయడం.
● 5 నుంచి 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత తరగతుల్లో చేర్పించడం.
● తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ప్రణాళిక ద్వారా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నమోదు పెంచడం.
● బడీడు పిల్లలను గుర్తించి వయసుకు తగిన తరగతిలో నమోదు చేయడం.
● బాలిక విద్య ప్రాముఖ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని పాఠశాలలో చేర్పించడం.
ఇవీ రోజువారీ కార్యక్రమాలు
● ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు అన్ని గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యుల ఇంటింటి ప్రచారం. ర్యాలీలు, బ్యానర్లు పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, బడీడు పిల్లలను బడిలో చేర్పించడం. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రాల్లో చేర్పించడం.
● 12న మన ఊరు, మనబడి కార్యక్రమం నిర్వహించడం. పాఠశాలలను మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించి పండుగ వాతావరణం కల్పించడం. విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలకడం.
● 13న విద్యార్థులకు అక్షరాస్యత, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించే తొలిమెట్టు కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన.
● 14న బాలసభ, పాఠశాల స్థాయిలో పిల్లల కమిటీలు, క్లబ్‌ల ఏర్పాటు.
● 15న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రాల్లో చేర్పించడం, బాల కార్మికులు లేరని నిర్ధారించుకోవడం.
● 16న పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం.
● 17న పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి ఉన్నత విద్య, వారి భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు.
పాఠశాలల వివరాలు
జిల్లాలో 886 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 178 ప్రాథమికోన్నత పాఠశాలలు, 244 ఉన్నత పాఠశాలలు, 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, 10 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో గత విద్యా సంవత్సరం సుమారు 1,48,309 మంది విద్యార్థులు అభ్యసించారు.
రేపటి నుంచి 17వ తేదీ వరకు..
రోజువారీగా ప్రత్యేక కార్యక్రమాలు
ప్రభుత్వ పాఠశాలల
బలోపేతమే లక్ష్యం
విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి
పకడ్బందీగా ఏర్పాట్లు
బడిబాట కార్యక్రమంలో భాగంగా బడీడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, ఇంగ్లిష్ మీడియం గురించి వివరించి చైతన్య పరుస్తాం.
– శంకర్ రాథోడ్, ఎంఈఓ, ఫరూఖ్‌నగర్
