
ప్రమాదానికి కారణమైన గడ్డి ట్రాక్టర్
కేశంపేట: గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండల పరిధిలోని అల్వాల గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొందుర్గు మండలం తంగెళ్లపల్లికి చెందిన చెక్కల రాంచంద్రయ్య (45), చెక్కల దశరథం, వెంకిర్యాల గ్రామానికి చెందిన సున్నాల నర్సింహులు (50) కలిసి వెంకిర్యాల గ్రామంలోనే ట్రాక్టర్‌లో గడ్డిని లోడ్ చేసేందుకు కూలీ పనులకు వెళ్లారు. వెంకిర్యాలలో గడ్డిని లోడ్ చేసుకుని కడ్తాల్ మండలంలోని మక్తామాధారం వద్ద అన్‌లోడ్ చేసేందుకు వెళ్తుండగా అల్వాల గ్రామ శివారులో అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంతో ట్రాక్టర్ ఇంజన్ పైన కూర్చున్న కూలీలు కిందపడటంతో ట్రాక్టర్ టైర్లు చెక్కల రాంచంద్రయ్య, సున్నాల నర్సింహులు పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. చెక్కల దశరథానికి గాయాలు కావడంతో అస్పత్రికి తరలించారు. మృతుడి అన్న చెక్కల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రాంచంద్రయ్య (ఫైల్)