సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను హయత్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.2 కోట్ల విలువ చేసే 450 కిలోల గంజాయితో పాటు రూ.20 వేల నగదు, ఇన్నోవా కారు, ఇనుప రాడ్డు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డిలతో కలిసి రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
● మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన మహ్మద్ బాబుమియా షేక్, షేక్ అజీజ్ సికందర్, సతీష్ జాదవ్, సుభాష్ జాదవ్, బాబు ఖాలేలు ముఠాగా ఏర్పడి మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు నిరంతరం గంజాయిని సరఫరా చేస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ధను నుంచి కిలో గంజాయి రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి.. మహారాష్ట్రలో రూ.20 వేలకు విక్రయిస్తుంటారు. లాభాలు అధికంగా ఉండటంతో క్రమంగా గంజాయి దందాలోకి దిగారు.
● ఈక్రమంలో మే 31న బాబుమియా షేక్, సికిందర్ ఇద్దరు కలిసి ఇన్నోవా కారులో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గాంజా సరఫరాదారు ధనును కలిశారు. 450 కిలోల గంజాయిని లోడ్ చేసుకొని, మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్‌కు చేరుకున్నారు. అప్పటికే విశ్వసనీయ సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి దొరికింది. బాబుమియా, సికిందర్‌లను అరెస్టు చేశారు. సతీష్ జాదవ్, సుభాష్ జాదవ్, బాబు ఖాలే, ధనులు పరారీలో ఉన్నారు.