
ధ్వంసమైన పోలీస్ వాహనం
దోమ: ఆలయ ప్రవేశం విషయంలో ఓ సామాజికవర్గానికి, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకోగా.. పక్కనే ఉన్న పోలీసు వాహనం ధ్వంసమైంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఎస్‌ఐ విశ్వజాన్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, కుల, మత తారతమ్యాలు పాటించకూడదని తెలిపారు. అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఉండాలని సూచించారు. అందరికీ ప్రవేశం కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలో గురువారం కొంతమంది దళితులు గ్రామంలోని గుడిలోకి వెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న సర్పంచ్ జగని వెంకటయ్య సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి చక్కబడలేదు. పలువురు దళితులు పోలీస్ స్టేషన్ వెళ్లి విషయం చెప్పడంతో.. డిప్యూటీ తహసీల్దార్‌తో కలిసి ఎస్‌ఐ గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించి సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వివరాలు ఆరా తీశారు. గుడి ప్రవేశం విషయంలోనే ఇరువర్గాలకు గొడవలు జరిగాయని గ్రామస్తులు వారి దృష్టికి తీసుకురాగా, కోపోద్రిక్తులైన ఇరువర్గాల వారు పోలీసుల ముందే రాళ్లు విసురుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, సీఐ వెంకటరామయ్య పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాల ప్రజలను చేదరగొట్టి గొడవ సద్దుమనిగేలా చేశారు. ఇదిలా ఉండగా ఎస్‌ఐ విశ్వజాన్ ఒకే వర్గానికి కొమ్ముకాయడంతోనే ఘర్షణ వాతావరణం నెలకొందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎస్‌ఐ స్పందించలేదు.
ఇరువర్గాల బాహాబాహీ
పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఆందోళనకారులు
పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం
బ్రాహ్మణపల్లిలో ఘటన