సర్వర్‌ డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

సర్వర్‌ డౌన్‌

Jun 2 2023 3:50 AM | Updated on Jun 2 2023 3:50 AM

తరచూ నిలిచిపోతున్న ఆర్టీఏ సేవలు

స్లాట్‌ బుకింగ్‌లు, సర్వీసుల్లో అంతరాయం

ఆర్సీలు, డ్రైవింగ్‌ లైసెన్సు స్లాట్‌లకు పడిగాపులు

సాక్షి, సిటీబ్యూరో: రవాణా శాఖ పౌర సేవలు మరోసారి స్తంభించాయి. తరచూ తలెత్తుతున్న సాంకేతిక వైఫల్యం పౌరసేవల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. రవాణా శాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవలు టీఎస్‌టీఎస్‌ (తెలంగాణ సే్‌ట్‌ టెక్నికల్‌ సర్వీస్‌)తో ముడిపడి ఉన్నాయి. తరచూ ఈ సాంకేతిక వ్యవస్థపై భారం పెరిగి సర్వర్‌ డౌన్‌ కావడంతో ఎక్కడికక్కడే పౌరసేవలు నిలిచిపోతున్నాయి. దీంతో వేలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు తదితర పౌరసేవల కోసం ఆర్టీఏ కేంద్రాలకు వచ్చిన వారు ఉన్నపళంగా సర్వర్‌ డౌన్‌తో సేవలు నిలిచిపోయినట్లు తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బుధవారంఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రేటర్‌లోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో సర్వర్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల పౌరసేవలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలోనూ ఇదే తరహా ఇబ్బందులు తలెత్తాయి. తరచూ ఇలాంటి సాంకేతిక వైఫల్యాల కారణంగా పనులు నిలిచిపోతున్నా రవాణాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

56 రకాల పౌరసేవలు ఆన్‌లైన్‌లోనే..

● డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, అంతర్రాష్ట్ర బదిలీలు, ప్రత్యేక నంబర్లపై ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌, పాత వాహనాలకు రిజిస్ట్రేషన్‌ల పునరుద్ధరణ, డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యువల్స్‌, డూప్లికేట్‌ ఆర్సీలు డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్సులు వంటి సుమారు 56 రకాల పౌరసేవలను రవాణాశాఖ ఆన్‌లైన్‌ ద్వారా అందజేస్తోంది. వాహనదారులు తమకు కావాల్సిన సేవల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకొని, ఆన్‌లైన్‌లోనే ఫీజులు చెల్లించవచ్చు. నమోదైన స్లాట్‌ ప్రకారం ఆర్టీఏ అధికారులు ప్రాంతీయ రవాణా కేంద్రాల నుంచి సర్వీసులను అందజేస్తారు.

● ఈ క్రమంలో ఈ– సేవ, టీ సేవ, మీ సేవ కేంద్రాల్లో నమోదయ్యే స్లాట్‌లు, ఫీజు చెల్లింపు వివరాలు మాత్రం టీఎస్‌టీఎస్‌ నుంచి రవాణాశాఖకు చేరుతాయి. వాహనదారులకు అందజేసే పౌరసేవల కోసం రవాణాశాఖ అంతర్గత సాంకేతిక సామర్థ్యం పటిష్టంగానే ఉన్నప్పటికీ టీఎస్‌టీఎస్‌ సర్వర్లు పడిపోవడంతోనే మొత్తం సేవలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని చోట్ల పౌరసేవలు స్తంభించిపోతున్నాయి. స్లాట్‌లు నమోదు కాక కొందరు, ఫీజులు చెల్లించినా పనులు పూర్తి కాకపోవడంతో మరికొందరు రవాణా అధికారుల చుట్టూ పడిగాపులు కాయాల్సివస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆన్‌లైన్‌ సేవల్లో విఘాతంతో సుమారు 6 వేల రవాణా కార్యకలాపాలపై ప్రభావం పడుతున్నట్లు అంచనా.

స్లాట్‌లు కూడా కష్టమే..

● పౌరసేవలు నిలిచిపోవడంతో పాటు చాలాసార్లు స్లాట్‌లు నమోదు కాకపోవడంతో కూడా ఇబ్బందులు తప్పడం లేదు. గ్రేటర్‌లో మెహిదీపట్నం, అత్తాపూర్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, మలక్‌పేట్‌, బండ్లగూడ, మేడ్చల్‌, ఇబ్రహీంపట్నం, కొండాపూర్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

● లెర్నింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, డ్రైవింగ్‌ లైసెన్సులు, హైపొతికేషన్‌ రద్దు వంటి వివిధ సేవలకు ఆన్‌లైన్‌ స్లాట్‌లు నమోదు కావడం లేదు. దీంతో వాహనదారులు ఈ–సేవ కేంద్రాలు, ఆర్టీఏ అధికారుల చుట్టూ పడిగాపులు కాయాల్సి వస్తోంది.

● అతికష్టంగా స్లాట్‌లు లభించినప్పటికీ ఆకస్మాత్తుగా సర్వర్‌లు పని చేయకపోవడంతో రవాణా కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు ఫీజులు చెల్లించినప్పటికీ పౌరసేవలు లభిస్తాయనే గ్యారంటీ లేకుండాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement