
సమావేశంలో మాట్లాడుతున్న పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య
షాద్‌నగర్‌రూరల్: పట్టా భూమికి పొజిషన్ చూపాలని వృద్ధురాలు వెంకటమ్మ ఏళ్లుగా ఎదురుచూస్తోందని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో చక్రవర్తి విలేకరులతో మాట్లాడారు. కేశంపేట మండలం కాకునూరు గ్రామానికి చెందిన దళిత వృద్ధురాలు ఎర్ర వెంకటమ్మకు గ్రామశివారులోని సర్వే నంబర్ 361/ఇ లో 20 గుంటల భూమి ఉందని అన్నారు. భూమి ధరణి పోర్టల్ రికార్డులో ఉందని, పట్టా పాసు పుస్తకం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు అందుతుందని అన్నారు. గతంలో చేపట్టిన ఏడీ సర్వే రిపోర్టులో పట్టా భూమి ఉన్నట్లు నిర్దారించారని అన్నారు. వృద్ధురాలు 12 ఏళ్లుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా నేటి వరకు పొజిషన్ మాత్రం చూపలేదని అన్నారు. వెంకటమ్మకు న్యాయం చేస్తామని తహసీల్దారు చెప్పినా నేటీకి నెరవేర్చడంలేదన్నారు. వృద్ధురాలికి మద్దతుగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎర్రవెంకటమ్మ భూ సమస్యను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 7న కాకునూరు నుంచి షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రను చేపడతామన్నారు. ఈ సమావేశంలో కేఏఎన్‌పీఎస్ నాయకులు గోవింద్, మోహన్‌కృష్ణ, లక్ష్మయ్య పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు
కేశంపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని అల్వాల గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన నిర్మల, బాలరాజు దంపతులు వేములనర్వ గ్రామంలో బంధువుల ఇంటికి బొడ్రాయి పండుగకు వచ్చి తిరిగి సొంత గ్రామానికి బైక్‌పై వెళ్తున్నారు.జల్‌పల్లికి చెందిన మల్లేశ్ బైక్‌పై అల్వాల గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రులకు తరలించారు.
ఫార్మాలో గ్యాస్ లీక్
నిజాంపేట్: బాచుపల్లిలోని ఓ ఫార్మా యూనిట్–3 కంపెనీలో గురువారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో గ్యాస్ లీకై ఏడుగురు ఆపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో వారిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగించారు. ఫార్మా కంపెనీలో మిథైల్ డై క్లోరైడ్ గ్యాస్ లీక్ కావడంతో ఎన్.గౌరీనాథ్(44), యాసిన్ అలీ (29),ప్రేమ్ కుమార్ (48),ప్రసాద్ రాజు (38) అస్వస్థతకు గురయ్యారు.
బడిబాటను విజయవంతం చేద్దాం
మొయినాబాద్‌రూరల్: పాఠశాలల ప్రారంభోత్సవంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని హిమాయత్‌నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఉపాధ్యాయులతో పాటు పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నందున అందులో భాగంగా బడిబాటను విజయవంతం చేయాలన్నారు. ఇందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజల, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవియాదవ్, శాంతియువజన సంఘం మాజీ అధ్యక్షుడు మల్లేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెహర్‌ఉన్నీసాబేగం, అంగన్‌వాడీ టీచర్ కవిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కేఏఎన్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రవర్తి