‘ట్రస్మా’ను బలోపేతం చేస్తాం | Sakshi
Sakshi News home page

‘ట్రస్మా’ను బలోపేతం చేస్తాం

Published Mon, Mar 27 2023 4:32 AM

సమావేశంలో మాట్లాడుతున్న శేఖర్‌రావు
 - Sakshi

రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌రావు

ఆమనగల్లు: ట్రస్మా(ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్‌)ను మరింత శక్తివంతంగా మారుస్తామని ఆ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రకటించారు. ట్రస్మా బైలాస్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆమనగల్లులోని శ్రీ లక్ష్మి గార్డెన్స్‌లో ఆదివారం ట్రస్మా రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావ్‌, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌, కోశాధికారి రమణారావ్‌, రాష్ట్ర ప్రతినిదులు, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో ట్రస్మా బైలాస్‌లో నూతనంగా పొందుపరిచిన అంశాల గురించి చర్చించి ఆమోదించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావ్‌ మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన ట్రస్మాలో ప్రస్తుతం 32జిల్లాల నుంచి 9వేల బడ్జెట్‌ పాఠశాలలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నారు. ప్రస్తుతం బడ్జెట్‌ పాఠశాలలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. వాటిని కాపాడుకోవడానికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అనేక ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయని, మరికొన్ని మనుగడ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయన్నారు. బడ్జెట్‌ పాఠశాలల మనుగడ కోసం ట్రస్మా బైలాస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఎస్‌ఎస్‌సీ హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచడం సరైన నిర్ణయం కాదని, దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బీరప్ప, రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు పరంజ్యోతి, నారాయణరెడ్డి, ఉమామహేశ్వర్‌, జోసఫ్‌, సీ అల్లాజీగౌడ్‌, టీ వెంకటయ్య, సువర్ణ, గోవర్ధన్‌రెడ్డి, ఏ నిరంజన్‌, శ్రీనివాసులు, జీ శ్రీనివాసులు, మహమూద్‌, శ్రీనివాస్‌, కోట్ల వెంకటేశ్‌, శ్రీనివాస్‌గుప్తా, సంజీవ్‌కుమార్‌, ఏ శివలింగం, చెన్నయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement