ఉంటుందా.. పోతుందా.. | - | Sakshi
Sakshi News home page

ఉంటుందా.. పోతుందా..

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

హైకోర్టులో ‘సెస్‌’ భవితవ్యం నేడు మరోసారి విచారణ జిల్లాపై ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ ఫోకస్‌ పక్షం రోజుల్లో రెండుసార్లు విజిట్‌ ఉద్యోగులకు బదిలీ భయం

సిరిసిల్ల: జిల్లాలో విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తున్న సహకార విద్యుత్‌ సరఫరా సంఘం లిమిటెడ్‌ (సెస్‌) ఉంటుందా.. రద్దు అయినట్లేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లకోసారి ‘సెస్‌’ వ్యాపార లైసెన్స్‌ను రెన్యువల్‌ చేయాల్సిన రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) లైసెన్స్‌ ఇవ్వకుండా ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోకి మార్చారు. శ్రీసెస్‌శ్రీను రద్దు చేస్తున్నట్లు టీజీఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. గత మార్చి 31తో లైసెన్స్‌ గడువు ముగియడంతో సిరిసిల్ల ప్రాంతంలో విద్యుత్‌ పంపిణీ సేవలను ఉత్తర డిస్కంలో విలీనం చేశారు. ‘సెస్‌’ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని వ్యాపార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఎన్‌పీడీసీఎల్‌కు టీజీఈఆర్‌సీ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 1న ‘సెస్‌’ను ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు ఆధీనంలోకి తీసుకుని విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తున్నారు.

కోర్టుకెక్కిన పాలకవర్గం

జిల్లాలో విద్యుత్‌ పంపిణీ సేవలను అందించే ‘సెస్‌’ పాలకవర్గం పదవీకాలం మరో 20 నెలలు ఉండగా, నోటీసు కూడా ఇవ్వకుండా, లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయకుండా 56 ఏళ్ల సంస్థను రద్దు చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, ‘సెస్‌’ వినియోగదారులు ఓట్లు వేసి ఎన్నుకున్న పాలకవర్గ పదవీకాలం ఉండగానే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ సంస్థ ఉసురు తీస్తున్నారని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు. జస్టిస్‌ వై.రేణుక ఈ కేసు విచారణను స్వీకరించారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది తమ వద్ద పూర్తి సమాచారం లేదని, పక్షం రోజులు గడువు కోరారు. వారం రోజుల్లోనే సమగ్ర వివరాలు కోర్టు ముందుంచుతూ, విచారణకు హాజరు కావాలని జస్టిస్‌ రేణుక స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం (ఈనెల 15న) మరోసారి ‘సెస్‌’ అంశం హైకోర్టులో విచారణకు రానుంది. సంస్థ ఉంటుందా.. పోతుందా అనే అంశం కోర్టు పరిధిలో ఉంది. మళ్లీ వాయిదాలు కోరుతారా, విచారణ సాగుతుందా లేదా అనే అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది.

మహాజనసభ తీర్మానం

సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో 56 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ‘సెస్‌’ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయాలని, సంస్థను రక్షించాలని ఈ నెల 4న సిరిసిల్లలో జరిగిన మహాజనసభలో విలేజీ ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రాణాలు పోయినా సంస్థను రక్షించి తీరుతామని చైర్మన్‌ చిక్కాల రామారావు వేదికపై ప్రకటించారు. మహాజనసభ తీర్మానంతో ‘సెస్‌’ పాలకవర్గం కోర్టును ఆశ్రయించింది. నిబంధనల మేరకు సంస్థ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయాలని కోరుతూ 90 రోజుల ముందే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను కావాలనే తొక్కి పెట్టి ఎన్‌పీడీసీఎల్‌కు ‘సెస్‌’ను అప్పగించిందని పాలకవర్గం పేర్కొంటుంది. న్యాయపోరాటం గెలుస్తుందనే అంచనాల్లో పాలకవర్గం ఉంది.

ఉద్యోగుల్లో బదిలీ భయం

‘సెస్‌’ పాలకవర్గం వర్సెస్‌ ప్రభుత్వ పోరులో 355 మంది ఉద్యోగులు చిక్కారు. సంస్థ విలీనం అయితే ఉద్యోగులను బదిలీ భయం వెంటాడుతుంది. జిల్లా పరిధిలోనే బదిలీ అవుతూ ఏళ్లకు ఏళ్లుగా ఉద్యోగా లు చేసిన సిబ్బంది ఇప్పుడు ఎన్‌పీడీసీఎల్‌ పరిధి లోకి వెళ్లడంతో జీతభత్యాలు ఏమీ పెరగకపోగా, బదిలీలు తప్పవనే భయం ఉంది. ‘సెస్‌’ పరిధిలో కీలక పోస్టుల్లో ఎన్‌పీడీసీఎల్‌ ఇంజినీర్లు ఉండగా, అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది, ఫీల్డ్‌ ఏఈఈలు ‘సెస్‌’ వాళ్లు ఉన్నారు. సంస్థ ఉంటే బదిలీ అయినా జిల్లా పరిధిలోనే ఉంటారు. రద్దయితే బదిలీ పరిధి కొత్తగా ఏర్పడిన 17 జిల్లాల పరిధిలోకి మారనుంది.

‘సెస్‌’ను ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేసుకుంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 3 లక్షల మందికిపైగా వినియోగదారులున్న సంస్థను టేకోవర్‌ చేస్తే అవాంఛనీయ ఘటనలు ఏమైనా చోటు చేసుకుంటాయా అని అంచనా వేశారు. ఈ మేరకు ఏప్రిల్‌ 1న సంస్థను ఆధీనంలోకి తీసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎంతో బిజీగా ఉండు ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి ‘సెస్‌’లో సమీక్షలు నిర్వహించి విద్యుత్‌ పంపిణీలో వినియోగదారులకు ఇబ్బందులు రానీయొద్దని అన్ని స్థాయిల అధికారులకు స్పష్టం చేశారు. పక్షం రోజుల్లో సిరిసిల్ల ప్రాంతాన్ని రెండు సార్లు సందర్శించి ‘సెస్‌’ పరిధిలో విద్యుత్‌ పంపిణీ సేవలపై ఫోకస్‌ పెట్టారు. ఎన్‌పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజినీర్లు, ఎస్‌ఈలు, ఇతర ఉన్నతాధికారులు వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లోనే పర్యటిస్తూ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తున్నారు. కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు భూసేకరణలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలోని పవర్‌లూమ్స్‌ కేటగిరిని మార్చుతూ, రూ.10 కోట్ల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లను స్టోర్స్‌కు తరలించారు. వినియోగదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందుచూపుతో జిల్లాపై ఫోకస్‌ చేస్తూ వారి మనసు దోచుకుంటున్నారు. జిల్లాలో కొత్త తరహా విద్యుత్‌ పంపిణీ సేవలు అందుబాటులోకి రావడంతో ఒక వర్గం విద్యుత్‌ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. మరో వైపు 56 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ ఉసురు తీయొద్దని మరో వర్గం కోరుతున్నారు. ఏది ఏమైనా ‘సెస్‌’ భవితవ్యం ‘కోర్టు’కు చేరింది. నేడు జరిగే విచారణతో సంస్థ ఉంటుందా..? పోతుందా.. అనేది తేలనుంది.

Advertisement
 
Advertisement
Advertisement