ఎన్నికల సిత్రాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల్లో ప్రతీ ఓటు ఎంతో కీలకం. స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన నాయకులు ఉన్నారు. తుర్కపల్లిలో కాశోల్ల పద్మ రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. రొడ్డ భాగ్యమ్మ సర్పంచ్‌గా గెలుపొందారు. పద్మ బంధువులు ముగ్గురు అనారోగ్యంతో ఉండడంతో ఓట్లు వేయలేకపోయారు. వారు వేసి ఉంటే ఒక్క ఓటుతోనైన పద్మ గెలిచేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. చీకోడులో బీఆర్‌ఎస్‌కు చెందిన పడిగె ఆంజనేయులు, బొమ్మెన ఆంజనేయులు తలపడ్డారు. పడిగె ఆంజనేయులపై 5 ఓట్ల మెజార్టీతో బొమ్మెన ఆంజనేయులు గెలుపొందారు. గూడెంలో కొమ్ము బాలయ్య 1,139 ఓట్లు సాధించినా 85 ఓట్లు వెనకపడ్డారు. రామలక్ష్మణపల్లెలో 36 ఓట్ల తేడాతో కోటగిరి ఎల్లవ్వ గెలుపోందారు. రామ్‌రెడ్డిపల్లెలో లక్ష్మి 27 ఓట్లతో గెలిచారు. మొర్రాయిపల్లెలో మెంగని శ్రీనివాస్ 338 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి మల్లారం రాజు 328 ఓట్లు సాధించి 10 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు.. ఇప్పుడు సర్పంచుగా ఎన్నికయ్యాడు. ముస్తాబాద్ మండలం గూడెం సర్పంచ్‌గా ఎన్నికై న తాటిపల్లి శంకర్ గతంలో ముస్తాబాద్ ఎంపీపీగా పనిచేశారు. 2004 ఆగస్టు 26 నుంచి 2006 జూలై 21 వరకు రెండేళ్లపాటు ఎంపీపీగా పనిచేశారు. గూడెం ఎంపీటీసీగా ఎన్నికై న శంకర్.. అప్పటి ఎంపీపీ మంత్రి రాజంపై పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో వైస్ ఎంపీపీగా ఉన్న కల్వకుంట్ల గోపాల్‌రావు ఐదు నెలలపాటు ఎంపీపీగా కొనసాగారు. అనంతరం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో గూడెం ఎంపీటీసీగా ఉన్న తాటిపల్లి శంకర్‌ను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శంకర్ 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వారు ముగ్గురు పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ముగ్గురు ఒక్కో పార్టీలో నాయకులుగా ఎదిగారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు మిత్రులు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ అభ్యర్థులుగా వివిధ పార్టీల మద్దతుతో బరిలోకి దిగారు. 1991–92 పదోతరగతి బ్యాచ్‌కు చెందిన ఎలగందుల నర్సింలు, శనిగరపు బాల్‌రాజు, కొర్రి రమేశ్ ఎల్లారెడ్డిపేట మేజర్ పంచాయతీ పోరులో తలపడ్డారు. చివరికి 432 ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎలగందుల నర్సింలు గెలుపొందారు. అలాగే వెంకటాపూర్‌లో ముగ్గురు క్లాస్‌మేట్స్ తలపడ్డారు. మామిండ్ల తిరుపతిబాబు తల్లి నర్సవ్వ, మేడిశెట్టి బాలయ్య భార్య పద్మ, రుద్రోజు వినీల పోటీపడ్డారు. వీరిలో మేడిశెట్టి పద్మ గెలుపొందారు.
ఎన్నికల సిత్రాలు


