బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం
పరిస్థితులు ఉద్రిక్తం
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వైనం
సిరిసిల్ల అర్బన్: కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలను దర్యాప్తు సంస్థలతో వేధించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ గురువారం జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసనదీక్షతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ జిల్లా ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కార్యాలయంలోకి బీజేపీ నాయకులను వెళ్లనీయకపోవడంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్పీ మహేశ్ బీ గీతేతోపాటు డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఇదే సమయంలో దీక్షా శిబిరానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేరుకొని పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు ఆఫీస్‌లో నుంచి ప్రతినినాదాలు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మోదీ, అమిత్ షాలు దర్యాప్తు సంస్థలను తమ ప్రతీకార రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నారు. జిల్లా గంథ్రాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పాల్గొన్నారు.
ధర్నా ఎందుకు చేస్తున్నారో వారికే తెలియదు
నేషనల్ హెరాల్డ్ కేసు వేసిన సుబ్రహ్మణ్యస్వామికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రశ్నించారు. బీజీపీ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని ఎందుకు పిలుపునిచ్చారో, ఎందుకు చేస్తున్నారో వారికే తెలి యదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తే, బీజేపీ నాయకులను పార్టీ ఆఫీస్‌లో బంధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం


