కలిసొచ్చిన అదృష్టం
మూడు నిమిషాలు ఆలస్యంతో నిలిచిన విత్‌డ్రా
ఎన్నికల పోరులో మూడు ఓట్లతో విజయం
గ్రామాభివృద్ధికి కృషి చేస్తానంటున్న సర్పంచ్ శ్రీకాంత్
వీర్నపల్లి(సిరిసిల్ల): అదృష్టం వెంటే ఉంటుందనే దానికి ఇతనే నిదర్శనం. వీర్నపల్లి మండలం భూక్యతండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన రమావత్ శ్రీకాంత్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. శ్రీకాంత్‌తోపాటు మరో ఏడుగురు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయగా.. ఆరుగురు విత్‌డ్రా చేసుకున్నారు. మిగిలిన ఒకరు శ్రీకాంత్ సైతం తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు కేంద్రానికి వెళ్లగా మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీలో నిలబడ్డారు. నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఒప్పుకున్నాం కదా.. అని నామమాత్రంగా పోటీకాకుండా బరిగీచి నిలబడ్డారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో మొత్తం ఓట్లు 548 ఉండగా 447 పోలయ్యాయి. నాలుగు ఓట్లు చెల్లకపోగా, రెండు పోస్టల్‌బ్యాలెట్లు పడ్డాయి. రమావత్ శ్రీకాంత్‌కు 222 ఓట్లు రాగా, మాలోత్ మదన్‌లాల్‌కు 219 ఓట్లు వచ్చాయి. మూడు ఓట్ల మెజార్టీతో శ్రీకాంత్ విజయం సాధించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు కలిసొచ్చిన అదృష్టాన్ని గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. గ్రామస్తులను అందరిని కలుపుకుపోయి సమస్యలు పరిష్కరిస్తానని, అదృష్టంగా గెలిచామని కాకుండా కష్టాన్ని నమ్ముకొని గ్రామస్తుల నమ్మకాన్ని గెలుస్తానన్నారు.


