ఆయిల్‌పామ్ సాగు పెంచాలి
● ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన కల్పించాలి ● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలోని రైతులకు ఫర్టిలైజర్ యాప్‌పై అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. చంద్రంపేట రైతువేదికలో గురువారం ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన, ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాల సాధనపై సంబంధిత అధికారులు, డీలర్లకు అవగాహన కల్పించారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్‌తో కలిగే ఉపయోగాలను రైతులకు వివరించాలన్నారు. యాప్ వినియోగంతో ఎరువుల వివరాలు, ఎక్కడ అందుబాటులో ఉందోననే సమాచారం తెలుస్తుందన్నారు. యాప్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు షాపుల యజమానులు ఒకరిని నియమించాలని సూచించారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


